గత కొద్ది రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎస్పీ బాలు ఆరోగ్యం గురించి శుభవార్త తెలిసింది. ఇప్పుడిప్పుడే ఆయన ఆరోగ్యం కుదుటపడుతున్నట్టు ఎస్పీ చరణ్ తెలిపారు. వార్డ్ లోకి వెళ్లి నాన్నని కలిసానని, ఆయన నన్ను గుర్తు పట్టారని చరణ్ వీడియో ద్వారా తెలిపారు. నాన్నని కంటికి రెప్పలా చూసుకుంటున్న ఎంజీఎం ఆసుపత్రి సిబ్బందికి ఈ సందర్బంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు చరణ్.
కాగా, బాలసుబ్రమణ్యంకు తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఫలితం నెగెటివ్ వచ్చిందని నిన్న వార్తలు హాల్ చల్ చేశాయి. వీటిపై స్పందించిన చరణ్.. తన తండ్రి ఆరోగ్యానికి సంబంధించి వైద్య బృందాన్ని సంప్రదించాక, ఎప్పటికప్పుడు ఆ హెల్త్ అప్‌డేట్‌లను తానే అందిస్తానని, ఏ విషయమైనా తన ద్వారానే తెలుస్తుందని ఎస్పీ చరణ్ అన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే ఇప్పుడు తాజాగా ఆయన ఆరోగ్యం కుదుటపడుతున్నట్టు స్వయంగా ఎస్పీ చరణ్ తెలియజేశారు.