కార్తీకం పరమపవిత్రమైన మాసం. ఈనెల అంతా నియమబద్దంగా స్నానం, దీపారాధన, ఉపవాసం, అభిషేకం, దానం చేస్తే అనంత పుణ్యఫలితం వస్తుంది. ఇహలోక సుఖాలే కాకుండా మోక్షప్రాప్తి కలుగుతుంది. అయితే నెలంతా కఠినమైన ఈ దీక్షలు చేయడం అందరి వల్ల కాదు. అటువంటి వారు కనీసం కింది చెప్పిన రోజుల్లో ఆయా పూజలు, ఉపవాసాలు చేస్తే మంచిదని పండితులు పేర్కొంటున్నారు. అవి ఏంటో తెలుసుకుందాం…
ఈ మాసంలో చేసే స్నాన దాన జపాల వల్ల అనంతమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయి. అయితే అలా రోజూ చేయలేని వారు కనీసం ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ, సోమవారాలలో లేదా ఒక్క పూర్ణిమ, సోమవారం నియమనిష్టలతో ఉపవాసం ఉండి, గుడికి వెళ్ళి దీపం వెలిగిస్తే లభించే పుణ్యఫలం చెప్పనలవి కానిది.
కార్తీకమాసంలో ప్రతిరోజూ విష్ణు ఆలయంలో దీపాన్ని వెలిగించడం చాలా మంచిది. ఇంట్లో కూడా ప్రతిరోజూ సంధ్యాదీపాన్ని వెలిగించాలి. మనలోని అజ్ఞానమనే చీకటిని తొలగించుకుని జ్ఞానమనే జ్యోతిని వెలిగించుకోవలన్నదే ఈ దీపారాధన ఉద్దేశ్యం. ఈ మాసమంతా కార్తీకపురాణాన్ని రోజుకో అధ్యాయం పారాయణం చేయడం శుభప్రదం.
– కేశవ