దేశంలో రెండో అత్యున్నత క్రీడా పురస్కారం ‘అర్జున అవార్డు’ను భారత పేస్ బౌలర్ మహమ్మద్ షమీ అందుకున్న విషయం తెలిసిందే. మంగళవారం రోజున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా షమీ అర్జున పురస్కారం అందుకున్నాడు. అనంతరం సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు చేశాడు.
ఈ క్షణం ఎంతో గర్వపడుతున్నాననంటూ.. ఈ స్థాయికి చేరుకోవడానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపాడు. కెరీర్ లో ఎత్తుపల్లాలు చవిచూసిన సమయంలో చాలా మంది మద్దతుగా నిలిచారని చెప్పుకొచ్చాడు. వన్డే ప్రపంచకప్‌లో అత్యున్నత ప్రదర్శనతోపాటు టీమ్‌ఇండియా క్రికెట్‌కు అందించిన సేవలకుగాను షమీకి అర్జున అవార్డును కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే.
‘‘ఈ క్షణం ఎంతో గర్వపడుతున్నా. రాష్ట్రపతి నన్ను ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డుతో సత్కరించారు. ఈ స్థాయికి చేరుకోవడానికి సహకారం అందించినవారందరికీ ధన్యవాదాలు. కెరీర్‌లో ఎత్తుపల్లాలు చవిచూసిన సమయంలో చాలా మంది మద్దతుగా నిలిచారు. నా కోచ్, బీసీసీఐ, జట్టులోని సహచరులు, నా కుటుంబం, స్టాఫ్ పాత్ర సహకారం వెల కట్టలేనిది. ముఖ్యంగా నా అభిమానులకు ఎల్లవేళలా రుణపడి ఉంటా. నా శ్రమను గుర్తించి గొప్ప అవార్డును ప్రకటించింనందుకు కృతజ్ఞతలు. దేశం గర్వపడేలా చేసేందుకు నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి నిరంతరం శ్రమిస్తా. అర్జున అవార్డులను అందుకున్న తోటి క్రీడాకారులకు శుభాకాంక్షలు’’ అని షమీ ఎక్స్‌లో పోస్టు పెట్టాడు.