Asia Cup 2022: భారత్​-పాక్​ మ్యాచ్​, ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?

-

యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ 2022లో భాగంగా ఆదివారం భారత్ పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. గతంలో ఈ రెండు జట్లు ఆసియాకప్‌లో 14 సార్లు తలపడ్డాయి. 50 ఓవర్ల ఫార్మాట్​లో 13 మ్యాచ్‌లు జరగగా, టీ20 ఫార్మాట్‌లో ఓ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లన్నింటిలో జరిగిన ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

పాకిస్థాన్ చివరిసారిగా మార్చి 2014లో భారత్‌పై ఆసియా కప్‌ను గెలుచుకుంది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ మరో రెండు బంతులు మిగిలి ఉండగానే ఓ వికెట్ తేడాతో విజయం సాధించింది. అశ్విన్ వేసిన ఓవర్లో షాహిద్ అఫ్రిది రెండు సిక్సర్లు బాది పాక్ జట్టుకు విజయాన్ని అందించాడు.

ఫిబ్రవరి 27, 2016న జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు భారత్‌పై కేవలం 83 పరుగులకే ఆలౌట్ అయింది. ఆసియా కప్‌లో భారత్‌పై పాక్ జట్టు సాధించిన కనిష్ట స్కోరు ఇదే.

ఆసియా కప్‌లో భారత్‌పై పాకిస్థాన్ ఇప్పటివరకు 300+ పరుగులు చేసింది. పాకిస్థాన్ జట్టు అత్యధిక స్కోరు 329 పరుగులు. ఈ స్కోర్లు వన్డే ఫార్మాట్‌లో వచ్చాయి.

ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన చివరి మూడు మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించింది. 2016 ఫిబ్రవరిలో టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఆసియా కప్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. దీని తర్వాత సెప్టెంబర్ 2018లో జరిగిన రెండు మ్యాచ్‌లలో (వన్డే) కూడా టీమ్​ఇండియానే గెలిచింది.

విరాట్ కోహ్లీ 2012 మార్చి 18న పాకిస్థాన్‌పై 183 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఆసియా కప్‌లో ఓ బ్యాటర్​ చేసిన అత్యధిక స్కోరు ఇదే.

2012, మార్చి 18 భారత్‌తో జరిగిన ఆసియా కప్ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓపెనర్ మహ్మద్ హఫీజ్ (105), నాసిర్ జంషెడ్ (112) తొలి వికెట్‌కు 224 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆసియా కప్‌లో ఇదే అత్యధిక భాగస్వామ్యం.

ఆసియా కప్‌లో 1988 అక్టోబర్ 31న పాకిస్థాన్‌పై భారత్‌కు చెందిన అర్షద్ అయూబ్ 21 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. ఆసియా కప్‌లో ఇప్పటివరకు భారత బౌలర్‌ చేసిన అత్యుత్తమ ప్రదర్శన ఇదే.

రోహిత్ శర్మ ఇప్పటివరకు ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై 61.16 బ్యాటింగ్ సగటు, 92.44 స్ట్రైక్ రేట్‌తో 367 పరుగులు చేశాడు. ఆసియా కప్‌లో పాకిస్థాన్ జట్టుపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

1995 ఏప్రిల్ 7 భారత్‌తో జరిగిన ఆసియా కప్ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఆటగాడు ఆకిబ్ జావేద్ 19 పరుగులకు 5 వికెట్లు తీశాడు. ఇప్పటివరకు ఆసియాకప్‌లో పాక్‌ బౌలర్‌ చేసిన అత్యుత్తమ ప్రదర్శన ఇదే.

ఆసియా కప్‌లో అక్టోబర్ 1988, ఏప్రిల్ 1995లో జరిగిన ఇండో-పాక్ మ్యాచ్‌లలో ఒక్క సిక్స్ కూడా కొట్టలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version