ధోనీ ర‌నౌట్‌పై దుమారం… ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న చెన్నై అభిమానులు..!

-

ధోనీ క్రీజులో ఉండి ఉంటే ఫ‌లితం త‌మ‌కే అనుకూలంగా వ‌చ్చేద‌ని, తాము గెలిచి ఉండేవార‌మ‌ని చెన్నై సూప‌ర్ కింగ్స్ అబిమానులు మండిప‌డుతున్నారు. థ‌ర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణ‌యంపై, ధోనీని అవుట్ అని ప్ర‌క‌టించ‌డంపై వారు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2019 సీజ‌న్ ముసిగింది. 12వ సీజన్‌లో ప్లేయ‌ర్లు క్రికెట్ అభిమానుల‌కు చ‌క్క‌ని వినోదాన్ని పంచారు. ఈ క్ర‌మంలోనే ఈ సీజ‌న్ ఫైన‌ల్స్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్‌, ముంబై ఇండియ‌న్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌గా, చెన్నైపై ముంబై 1 ప‌రుగు తేడాతో గెలుపొందింది. దీంతో ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు స‌భ్యులు త‌మ అభిమానుల‌తో క‌ల‌సి ముంబైలో విజ‌యోత్స‌వ ర్యాలీ కూడా నిర్వ‌హించారు. అయితే ఫైన‌ల్ మ్యాచ్ లో చెన్నై కెప్టెన్ ధోనీని ర‌నౌట్ గా ప్ర‌క‌టించ‌డంపై దుమారం రేగుతోంది.

ఐపీఎల్ 12 సీజ‌న్ ఫైన‌ల్ మ్యాచ్‌లో చివ‌రి బంతి వ‌ర‌కు మ్యాచ్‌ ఉత్కంఠ‌గా సాగింది. అయితే చెన్నై ఇన్నింగ్స్‌లో 13వ ఓవ‌ర్‌లో ముంబై బౌల‌ర్ హార్దిక్ పాండ్యా వేసిన 4వ బంతికి వాట్స‌న్ సింగిల్ తీశాడు. ఈ క్ర‌మంలో రెండో ప‌రుగు కూడా తీయాల‌న్న ఉద్దేశంతో ధోనీ, వాట్స‌న్‌లు ప‌రుగు తీయ‌డం మొద‌లు పెట్టారు. అయితే ఫీల్డింగ్‌లో ఉన్న ముంబై ప్లేయ‌ర్ ఇషాన్ కిష‌న్ బంతిని వికెట్ల పైకి విసిరాడు. దీంతో బంతి వికెట్ల‌ను గిరాటేసింది. ఈ క్ర‌మంలో తాను ఔట‌య్యాన‌ని భావించిన ధోనీ తొలుత పెవిలియ‌న్‌కు వెళ్ల‌డం మొద‌లు పెట్టాడు. కానీ అంపైర్లు అత‌న్ని ఆపి థ‌ర్డ్ అంపైర్ నిర్ణ‌యం కోసం సిగ్న‌ల్ ఇచ్చారు.

అయితే థ‌ర్డ్ అంపైర్ మాత్రం ఎంత సేప‌టికీ త‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించ‌లేదు. కానీ చివ‌ర‌కు ధోనీని ఔట్‌గా ప్ర‌క‌టించారు. అయితే రీప్లేలో మాత్రం ధోనీ ఔట్ అయ్యాడా, లేదా అన్న‌ది స్ప‌ష్టంగా తేల‌లేదు. దీంతో కామెంటేట‌ర్లు బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ధోనీని నాటౌట్‌గా ప్ర‌క‌టించి ఉండాల్సింది అని అభిప్రాయ‌ప‌డ్డారు. అయితే థర్డ్‌ అంపైర్‌ నిగెల్‌ లాంగ్ మాత్రం ధోనీని అవుట్ అనే ప్ర‌క‌టించ‌డంతో ధోనీ వెనుదిరిగాడు.

అయితే ధోనీ క్రీజులో ఉండి ఉంటే ఫ‌లితం త‌మ‌కే అనుకూలంగా వ‌చ్చేద‌ని, తాము గెలిచి ఉండేవార‌మ‌ని చెన్నై సూప‌ర్ కింగ్స్ అబిమానులు మండిప‌డుతున్నారు. థ‌ర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణ‌యంపై, ధోనీని అవుట్ అని ప్ర‌క‌టించ‌డంపై వారు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో సోష‌ల్ మీడియాలో చెన్నై అభిమానులు పోస్టుల వ‌ర్షం కురిపిస్తూ అంపైర్ నిర్ణ‌యాన్ని త‌ప్పు ప‌డుతున్నారు.. అయినా ఇక అది జ‌రిగిపోయింది కాబ‌ట్టి ఇక ఎవ‌రూ ఆ విష‌యంలో ఏమీ చేయ‌లేరు. క‌నుక చెన్నై అభిమానులూ… వ‌చ్చే సారి టీం ఐపీఎల్ ట్రోఫీ గెల‌వాల‌ని కోరుకోండి.. కోపం తెచ్చుకోకండి..!

Read more RELATED
Recommended to you

Latest news