ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ సక్సెస్‌కు కెప్టెన్ ధోనీతోపాటు స్టార్ బ్యాట్స్‌మన్ సురేష్ రైనా కూడా కారణం అని చెప్పవచ్చు. ఈ ఇద్దరి వల్లే చెన్నై ఐపీఎల్‌లో విజయ పరంపరను కొనసాగిస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ ఇద్దరూ తమ అద్భుతమైన ప్రదర్శనలతో ఐపీఎల్‌లో చెన్నై జట్టులో మెరిశారు. అలాగే దక్షిణాదిలో ఎంతో పాపులర్ అయ్యారు. వీరు మంచి స్నేహితులు కూడా.
2008లో ఐపీఎల్‌కు గాను ఆటగాళ్ల వేలం నిర్వహించినప్పుడు ధోనీ భారత జట్టు కెప్టెన్‌గా ఉన్నాడు. ఆ సమయంలో చెన్నై ధోనీని ముందుగా వేలంలో 1.5 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. అయితే అదే వేలంలో చెన్నై సురేష్ రైనాను 6.50 లక్షల డాలర్లకు కొనుగోలు చేసింది. ఈ క్రమంలో రైనాను చెన్నై కొనుగోలు చేశాక ధోనీ ఏమన్నాడో సురేష్ రైనా ఓ పుస్తకంలో తెలిపాడు.
సురేష్ రైనాను వేలంలో చెన్నై కొనుగోలు చేశాక ధోనీ.. మజా ఆయేగా దేఖ్.. అని రైనాతో అన్నాడు. ఈ విషయాన్ని రైనా బిలీవ్ అనే పుస్తకంలో తెలిపాడు. ఐపీఎల్ వేలంలో పాల్గొనేందుకు ఉత్సాహంగా ఎదురు చూశానని, తనను చెన్నై టీమ్ కొన్నందుకు సంతోషంగా ఉందని, తనను చెన్నై కొనుగోలు చేశాక ధోనీ అన్న మాటలు ఇప్పటికీ గుర్తున్నాయని రైనా ఆ పుస్తకంలో తెలిపాడు. ఆ టీమ్‌కు మొదట్లో మాథ్యూ హేడెన్, ముత్తయ్య మురళీధరన్, స్టీఫెన్ ఫ్లెమింగ్ లాంటి స్టార్ క్రికెటర్లు ఆడారని, వారితో కలిసి డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకోవడం సంతోషాన్నిచ్చిందని రైనా ఆ బుక్‌లో తెలియజేశాడు.