ఇండియన్ ప్రీమియర్ లీగ్ (2021) రెండో దశ మ్యాచ్‌లు త్వరలో జరగనున్న విషయం విదితమే. అన్ని మ్యాచ్ లను దుబాయ్‌లో నిర్వహించనున్నారు. అయితే ఐపీఎల్‌కు వచ్చే ఏడాది బ్రాడ్ కాస్ట్ హక్కుల గడువు ముగియనుంది. దీంతో ఈ ఏడాది చివరి వరకు బిడ్డింగ్ నిర్వహించనున్నారు. అందులో రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ఐపీఎల్ మ్యాచ్‌ల డిజిటల్, శాటిలైట్ ప్రసారాలకు గాను స్టార్ నెట్‌వర్క్ 2018-2022 కాలానికి మొత్తం రూ.16,347.50 కోట్లతో హక్కులను సొంతం చేసుకుంది. అప్పట్లో ఆ బిడ్డింగ్‌లో ఫేస్‌బుక్, అమెజాన్, ట్విట్టర్, యాహూ, రిలయన్స్ జియో, స్టార్ ఇండియా, సోనీ పిక్చర్స్, డిస్కవరీ, స్కై, బ్రిటిష్ టెలికాం, ఈఎస్‌పీఎన్ వంటి సంస్థలు పోటీ పడ్డాయి. అయినప్పటికీ స్టార్ నెట్‌వర్క్ ఐపీఎల్ హక్కులను సొంతం చేసుకుంది.
ఇక కేవలం డిజిటల్ హక్కుల కోసం రిలయన్స్ జియో రూ.3075 కోట్లను బిడ్ వేయగా, అందులోనూ స్టార్ నెట్‌వర్క్ జియోను ఓడించి ఆ రైట్స్‌ను సొంతం చేసుకుంది. అయితే ఈ సారి మాత్రం బిడ్డింగ్‌లో ఎలాగైనా డిజిటల్, శాటిలైట్ రెండు రకాల హక్కులను సొంతం చేసుకోవాలని రిలయన్స్ జియో ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే తమ సంస్థ నెట్‌వర్క్ 18ను కూడా ఇందులో భాగస్వామ్యం చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇక డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌కు ఎస్‌వీపీ అండ్ అడ్వర్టయిజింగ్ హెడ్‌గా పనిచేసిన గుల్షన్ వర్మను జియో యాడ్స్ సీఈవోగా కూడా నియమించుకున్నారు. దీంతో ఈసారి ఐపీఎల్ బ్రాడ్‌కాస్ట్ రైట్స్ బిడ్డింగ్‌లో జియో స్టార్ నెట్ వర్క్‌కు సైతం గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.