ఆస్ట్రేలియాతో టీమిండియా అడిలైడ్ లో డే నైట్ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 6 వికెట్లు కోల్పోయి 233 పరుగులు చేసింది. వృద్ధిమాన్ సాహా, రవిచంద్రన్ అశ్విన్‌లు క్రీజులో ఉన్నారు. వారు శుక్రవారం ఆటను కొనసాగించనున్నారు.
కాగా టెస్ట్ మ్యాచ్ సందర్భంగా భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి మరొక రికార్డును సొంతం చేసుకున్నాడు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 180 బంతులు ఆడిన కోహ్లి 74 పరుగులు చేశాడు. ఈ క్రమంలో కోహ్లి ఆస్ట్రేలియాపై అత్యధిక టెస్టు పరుగులు చేసిన భారత కెప్టెన్ గా రికార్డు సృష్టించాడు. గత 51 సంవత్సరాలుగా ఈ రికార్డు ఎంఏకే పటౌడీ పేరిట ఉంది. ఆస్ట్రేలియాతో భారత్ ఆడిన 40 టెస్ట్ మ్యాచ్‌లకు పటౌడీ కెప్టెన్‌గా వ్యవహరించి 829 పరుగులు చేయగా, కోహ్లి 10 టెస్టులకు నాయకత్వం వహించి 851 పరుగులు చేశాడు. దీంతో ఆస్ట్రేలియాతో భారత్ ఆడిన టెస్ట్ మ్యాచ్‌లకు గాను అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా కోహ్లి రికార్డు నెలకొల్పాడు.
అయితే భారత్ అడిలైడ్ టెస్టులో ఆరంభం నుంచి నిదానంగా ఆడుతూ వచ్చింది. ఓ దశలో కోహ్లి, రహానే ఇద్దరూ చక్కని పార్ట్‌నర్ షిప్‌తో ఇన్నింగ్స్‌ను నిర్మిస్తుండగా.. కోహ్లి అనవసరంగా రనౌట్ అయ్యాడు. దీంతో రహానే, విహారిలు వెంట వెంటనే పెవిలియన్ బాట పట్టారు.