100 గ్రాముల అధిక బరువు కారణంగా ఒలింపిక్స్‌లో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ స్వర్ణ పతకం గెలిచే అవకాశం కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పరిణామాలతో ఆమె ఏకంగా తన ఆటకు రిటైర్మెంట్ ప్రకటించింది. అయితే ఈ స్టార్ రెజ్లర్ టాలెంట్కు, ఆమె చూపిన ధైర్యానికి హర్యానా ప్రభుత్వం ఆమెను విజేతగానే పరిగణిస్తోంది. ఈ క్రమంలోనే తమ విన్నర్ గర్ల్కు ఘనస్వాగతం పలికేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
వినేశ్ ఫొగాట్ను ఘనంగా స్వాగతించి సత్కరించాలని హర్యానా సీఎం నయాబ్‌సింగ్ షైనీ ఓ ప్రకటన చేశారు. ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన వారికి ఇచ్చే రివార్డ్‌ను ఆమెకు కూడా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. హర్యానా రాష్ట్ర ప్రభుత్వ క్రీడా విధానం ప్రకారం ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన వారికి రూ.6కోట్లు, రజత పతకధారికి రూ.4కోట్ల రివార్డ్, కాంస్య పతకం సాధించిన వారికి రూ.2.5 కోట్ల నగదు ఇస్తారు. అయితే వినేశ్ ఫొగాట్ను కూడా విన్నర్ గా పరిగణిస్తున్న ఆ రాష్ట్ర సర్కార్ ఆమెను రజత పతక విజేతగా పరిగణించి, రూ.4కోట్ల నగదు పురస్కారాన్ని అందజేయాలని నిర్ణయించింది.