మధ్యప్రదేశ్ లోని ఇండోర్ స్టేడియంలో బంగ్లాదేశ్-భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో భారత బౌలర్లు రెచ్చి పోయారు. పేసర్ల ధాటికి బంగ్లా బ్యాట్స్ మెన్ తలవంచారు. భారత బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్ ఆటగాళ్లు 58.3 ఓవర్లలో 150 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ఏ ఒక్క దశలోనూ బంగ్లా బ్యాట్స్‌మెన్స్ భారత బౌలర్ల దూకుడుకు అడ్డుకట్టవేయలేకపోయారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ జట్టు 12 పరుగులకే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. చెరో ఆరు పరుగులు చేసి ఓపెనర్లు షాద్‌మన్ ఇస్లాం, ఇమ్రుల్ కయేస్ పెవిలియన్ బాట పట్టారు.
అనంతరం క్రీజులోకొచ్చిన మహ్మద్ మిథున్ కూడా 13 పరుగులు చేసి షమీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. బంగ్లా జట్టులో ముష్ఫికర్ రహీమ్ 43, మోమినుల్ హక్(కెప్టెన్) 37 పరుగులతో రాణించారు. మిగిలిన వారంతా తక్కువ పరుగులకే పెవిలియన్ బాట పట్టారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 3 వికెట్లు తీసి రాణించాడు. ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్‌కు తలో రెండు వికెట్లు దక్కాయి.