భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఒలింపిక్స్ పోటీలు ముగిసిన అనంతరం నీరజ్ భారత్‌కు రాలేదు. పారిస్ నుంచి డైరెక్టుగా అతను జర్మనీకి బయలుదేరాడు. అయితే తనకైన గాయానికి శస్త్రచికిత్సకు సంబంధించి వైద్య సలహా తీసుకోవడానికి అక్కడికి వెళ్లినట్లు సమాచారం. అదే విధంగా రాబోయే డైమండ్ లీగ్‌ల్లో పాల్గొనాలా? వద్దా అని వైద్యులను అడగనున్నట్లు తెలిసింది.
నీరజ్ జర్మనీకి వెళ్లాడని అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. కనీసం మరో 45 రోజుల వరకు భారత్‌కు తిరిగి వచ్చే అవకాశం లేదని వెల్లడించారు. ఇక పారిస్‌లోని భారత ఒలింపిక్ అసోసియేషన్ వర్గాలు కూడా నీరజ్ జర్మనీకి వెళ్లినట్లు ధ్రువీకరించాయి. ఈ ఒలింపిక్స్‌కు ముందు కొన్నిరోజులు జర్మనీలోని సార్‌బ్రూకెన్‌లో నీరజ్ చోప్రా శిక్షణ పొందాడు. ఇక డైమండ్ లీగ్ ఫైనల్ సెప్టెంబర్ 14న బెల్జియంలోని బ్రసెల్స్‌లో జరగనుంది. ఈ ఫైనల్లో ఆడాలనుకుంటున్నట్లు పారిస్ ఒలింపిక్స్ సమయంలో చోప్రా తెలిపాడు.