పాక్‌లాగే లంక‌.. అత్య‌ల్ప స్కోరుకే ఆలౌట్‌.. అల‌వోక‌గా గెలిచిన కివీస్‌..!

-

ఐసీసీ వ‌రల్డ్ క‌ప్ 2019లో న్యూజిలాండ్ బంప‌ర్ విక్ట‌రీ సాధించింది. తాను ఆడిన తొలి మ్యాచ్‌లోనే అద్భుత‌మైన ఆరంభం దొరికింది. శ్రీలంక‌తో జ‌రిగిన వ‌ర‌ల్డ్ క‌ప్ 3వ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జ‌ట్టు 10 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. కార్డిఫ్ పిచ్‌పై శ్రీ‌లంక బ్యాట్స్‌మెన్ ప‌రుగుల వ‌ర‌ద పారిస్తార‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ అంద‌రి అంచ‌నాలు తారుమారు అయ్యాయి. ఈ క్ర‌మంలో లంక బ్యాటింగ్ ఆర్డ‌ర్ కుప్ప‌కూలింది. మ్యాచ్ మొత్తం కివీస్ ప‌క్షమే సాగింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ బ్యాట్స్‌మ‌న్ మార్టిన్ గ‌ప్తిల్ (73 నాటౌట్‌, 51 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), కోలిన్ మున్రో (58 నాటౌట్‌, 47 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌)లు రాణించారు. దీంతో కివీస్ 16.1 ఓవ‌ర్ల‌లో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ల‌క్ష్యాన్ని ఛేధించింది.

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కివీస్ లంక‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్ర‌మంలో కివీస్ బౌల‌ర్లు వేసిన అద్భుత‌మైన బంతుల‌కు లంక బ్యాట్స్‌మెన్ త‌డ‌బ‌డ్డారు. క్రీజులోకి ఎలా వ‌చ్చారో అలాగే వెనుదిరిగారు. ఈ క్ర‌మంలో లంక జ‌ట్టులో కేవ‌లం ముగ్గురు మాత్ర‌మే రెండంకెల స్కోరు చేశారు. కాగా న్యూజిలాండ్ బౌలర్ల‌ను ఎదుర్కోవ‌డంలో లంక బ్యాట్స్‌మెన్ దారుణంగా విఫ‌లం అయ్యారు.

ఇక శ్రీ‌లంక కెప్టెన్ దిముత్ క‌రుణ‌ర‌త్నె (84 బంతుల్లో 52 ప‌రుగులు, 4 ఫోర్లు) హాఫ్ సెంచ‌రీతో రాణించాడు. దీంతో లంక జ‌ట్టు 29.2 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 136 ప‌రుగులు మాత్ర‌మే చేసి ఆలౌట్ అయింది. లంక బ్యాట్స్‌మెన్ల‌లో కుశాల్‌ పెరీరా (24 బంతుల్లో 29 ప‌రుగులు, 4 ఫోర్లు), తిశార పెరీరా (23 బంతుల్లో 27 ప‌రుగులు, 2 సిక్స‌ర్లు) మాత్ర‌మే ఫ‌ర్వాలేద‌నిపించారు. ఇక కివీస్ బౌల‌ర్ల‌లో హెన్రీ, ఫెర్గుసన్‌లు చెరో 3 వికెట్లు తీశారు. అనంత‌రం బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్ వికెట్ నష్ట‌పోకుండా 16.1 ఓవ‌ర్ల‌లో 137 ప‌రుగులు చేసి త‌న ఆరంభ మ్యాచ్‌లోనే అదిరిపోయే ప్రారంభాన్ని పొందింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version