భారత్ చేతిలో పాకిస్థాన్ ఓడిపోయినందుకు గాను జట్టుతోపాటు టీం మేనేజ్‌మెంట్‌ను, సెలెక్షన్ కమిటీని కూడా బాధ్యులను చేస్తూ వారిపై చర్యలు తీసుకోవాలని, పాకిస్థాన్ జట్టును నిషేధించాలని కోరుతూ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.
ఇటీవల జరిగిన వన్డే ప్రపంచ కప్ మ్యాచ్‌లో భారత్ చేతిలో ఘోర పరాజయం పాలైన పాకిస్థాన్‌కు ఇప్పట్లో కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. ఆ జట్టు ఇంటా బయటా అందరిచే విమర్శల పాలవుతోంది. పాక్ జట్టు ఓటమిని ఆ దేశ క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే ఎంతో మంది ఫ్యాన్స్‌తోపాటు పలువురు మాజీ పాక్ క్రికెటర్లు కూడా పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌తోపాటు టీం మేనేజ్‌మెంట్‌ను పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు. అయితే తాజాగా ఓ పాక్ క్రికెట్ అభిమాని మాత్రం తమ జట్టు భారత్ చేతిలో ఓడిపోయినందుకు గాను పాకిస్థాన్ క్రికెట్ టీంను నిషేధించాలని కోరుతూ కోర్టులో పిల్ వేశాడు.
పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన గుజ్రన్‌వాలా అనే వ్యక్తి కోర్టు మెట్లెక్కాడు. భారత్ చేతిలో పాకిస్థాన్ ఓడిపోయినందుకు గాను జట్టుతోపాటు టీం మేనేజ్‌మెంట్‌ను, సెలెక్షన్ కమిటీని కూడా బాధ్యులను చేస్తూ వారిపై చర్యలు తీసుకోవాలని, పాకిస్థాన్ జట్టును నిషేధించాలని కోరుతూ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీంతో ఇప్పుడీ విషయం కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాగా ఆ అభిమాని.. పాక్ టీంతోపాటు ఇంజమామ్ ఉల్ హక్ అధ్యక్షతన ఉన్న సెలెక్షన్ కమిటీని కూడా నిషేధించాలని తన పిటిషన్‌లో కోరాడు. దీంతో న్యాయమూర్తి ఆ పిటిషన్‌ను విచారించారు. ఈ విషయంపై నివేదిక ఇవ్వాలని ఇప్పటికే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)కి ఆదేశాలు కూడా జారీ చేశారు. దీంతో ఇవాళ పీసీబీ సమావేశం అవుతోంది. ఈ క్రమంలోనే పాక్ జట్టు మేనేజ్‌మెంట్ టీంలోనూ భారీ మార్పులు చేయనున్నట్లు తెలిసింది. ఏది ఏమైనా… పాకిస్థాన్‌కు మాత్రం భారత్ చేతిలో ఓటమితో చచ్చేంత కష్టం వచ్చి పడింది. ఇకపై జరగనున్న అన్ని మ్యాచ్ లను గెలిస్తే తప్ప పాక్‌కు సెమీ ఫైనల్ వెళ్లేందుకు అవకాశం లేదు. మరి ఆ జట్టు ఏం చేస్తుందో, సెమీ ఫైనల్ వరకు వెళ్తుందో, లేదో.. వేచి చూస్తే తెలుస్తుంది..!