పారిస్ ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శన చేసి, ఫైనల్ నుంచి అనూహ్యంగా అనర్హతకు గురైన భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ను ప్రధాని మోదీ ‘వీర పుత్రిక’ అని కొనియాడారు. ఇటీవల జరిగిన ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్లతో స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఆయన భేటీ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ భేటీ హైలైట్స్‌ను తాజాగా మోదీ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఈ సందర్భంగానే వినేశ్ ను వీరపుత్రిక గా అభివర్ణించారు.
‘‘ఒలింపిక్స్‌లో భారత క్రీడాబృందం అద్భుత ప్రతిభ కనబర్చింది. ప్రతిఒక్కరూ తమవంతు ప్రయత్నం చేశారు. వారి ఆటతీరుపై ఈ దేశం గర్వంగా ఉంది’’ అంటూ వారితో ముచ్చటించిన దృశ్యాలను షేర్ చేశారు. మరోవైపు ఈ భేటీలో ఒలింపిక్స్ స్టార్లు మోదీకి ప్రత్యేక బహుమతులను అందించారు.
ఇక రెజ్లర్ వినేశ్ ఫొగాట్ కు కాస్ లో అనుకూలంగా తీర్పు వస్తుందని దేశమంతా ఆశగా ఎదురుచూసినా వినేశ్ చేసిన అప్పీల్‌ను కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (కాస్) బుధవారం కొట్టేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే క్రీడాకారులతో మాట్లాడుతున్న సమయంలో వినేశ్ ప్రదర్శనను అభినందించారు.