దసరా అంటేనే అందరికి గుర్తుకు వచ్చేది పూజ,ఉపవాసం. ఇక నవరాత్రి వేడుకలు కేవలం అమ్మవారిని పూజించడం మాత్రమే కాదు అవి మన శరీరానికి, మనసుకు ఆత్మకు సంబంధించిన లోతైన ఆధ్యాత్మిక ప్రయాణం. ఈ తొమ్మిది రాత్రులు చేసే ఉపవాసం మన అంతర్గత శక్తిని మేల్కొల్పడానికి మనలోని చెడు ఆలోచనలను తొలగించడానికి ఒక గొప్ప సాధన. ఇది కేవలం ఆహారాన్ని త్యజించడం కాదు మనలోని అహంకారాన్ని దురాశను కోపాన్ని జయించడానికి చేసే ఒక ఆత్మ పరిశీలన. ఈ ఉపవాసంతో మన శరీరం శుద్ధి అవుతుంది మనసు ప్రశాంతంగా మారుతుంది.
ఉపవాసం, దాని వెనుక ఉన్న శాస్త్రీయత: నవరాత్రి ఉపవాసానికి అనేక శాస్త్రీయ, ఆధ్యాత్మిక కారణాలు ఉన్నాయి. వసంత రుతువు శరదృతువులలో వాతావరణంలో మార్పులు వస్తాయి. ఈ సమయంలో మన రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ఉపవాసం మన జీర్ణవ్యవస్థకు విశ్రాంతినిచ్చి, శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది మన శరీరాన్ని రాబోయే సీజన్‌కు సిద్ధం చేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం ఈ కాలంలో తేలికపాటి ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది.

ఆధ్యాత్మిక ప్రాముఖ్యత: నవరాత్రి ఉపవాసం మనలోని ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుంది. ఇది మన ఆత్మకు దైవిక శక్తికి మధ్య ఒక వంతెనలా పనిచేస్తుంది. ఉపవాసంతో మనసులో సాత్విక గుణాలు పెరుగుతాయి. మనలోని ప్రతికూల ఆలోచనలు తగ్గి సానుకూలత పెరుగుతుంది. ఈ తొమ్మిది రోజులు మనం అమ్మవారి నవదుర్గ రూపాలను పూజిస్తూ ఆమె నుంచి ఆశీస్సులు పొందుతాం. ఇది మన జీవితంలో సంతోషాన్ని, శ్రేయస్సును విజయాన్ని తీసుకొస్తుంది. ఉపవాసంతో మనలో క్రమశిక్షణ, నిగ్రహం పెరుగుతాయి.
నవరాత్రి ఉపవాసం ఒక గొప్ప ఆధ్యాత్మిక సాధన. ఇది మన శరీరాన్ని, మనసును, ఆత్మను శుద్ధి చేసి మన జీవితంలో కొత్త శక్తిని ఉత్తేజాన్ని నింపుతుంది. ఈ ఉపవాసం కేవలం ఒక నియమం కాదు అది మనల్ని మనం తిరిగి కనుగొనే ఒక అవకాశం. ఈ తొమ్మిది రోజులు ఉపవాసం ఉండటం ద్వారా మనం ఆరోగ్యకరమైన ప్రశాంతమైన జీవితాన్ని పొందవచ్చు.
గమనిక: ఉపవాసం చేసే ముందు మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్యుడి సలహా తీసుకోవడం మంచిది. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, వృద్ధులు ఉపవాసం చేయకపోవడం మంచిది.