శ్రీలంక ఫాస్ట్ బౌలర్ కసున్ రజిత చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఆస్ట్రేలియాలోని అడిలైడ్ లో ఆస్ట్రేలియా, శ్రీలంకకు మధ్య మూడు టీ20ల సిరీస్ జరుగుతోంది. ఇందులో భాగంగా నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి ఏకంగా 75 పరుగులిచ్చి శ్రీలంక ఆటగాడు కసున్ రజిత చెత్త రికార్డును నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో రజిత… తాను వేసిన మొదటి ఓవర్‌లో 11 పరుగులు, రెండో ఓవర్‌లో 21 పరుగులు, మూడో ఓవర్‌లో 25 పరుగులు, నాలుగో ఓవర్‌లో 18 పరుగులు ఇచ్చాడు. ఒక్క వికెట్ కూడా తీయలేదు. టీ20ల్లో ఇదే అత్యంత చెత్త ప్రదర్శనగా నిలిచింది. అంతర్జాతీయ టీ20ల్లో ఇదే అత్యంత చెత్త ప్రదర్శనగా లిఖించబడింది.
ఇప్పటివరకూ అంతర్జాతీయ టీ20ల్లో ఏ ఒక్క బౌలర్ 70కు మించి పరుగులు ఇవ్వకపోగా రజిత మాత్రం 75 పరుగులతో అపప్రథను సొంతం చేసుకున్నాడు. అడిలైడ్ లో జరిగిన ఈ టీ20లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. శ్రీలంకకు 234 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది. ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ ను శ్రీలంక బౌలర్లు కట్టడి చేయలేకపోయారు. మైదానంలో ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ పరుగుల వరద పారించారు. శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 99 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ఆసీస్ 134 పరుగులతో విజయం సాధించింది.