ఇంగ్లండ్ చేతిలో భార‌త్ ఓడిన మ్యాచ్‌.. ధోనీ, జాద‌వ్‌ల‌ను ఏకిపారేస్తున్న ఫ్యాన్స్‌..!

-

నిన్న‌టి మ్యాచ్‌లో ధోనీ చివ‌రి ఓవ‌ర్, చివ‌రి బంతి వ‌ర‌కు ఉన్నా భార‌త్ గెల‌వ‌లేక‌పోయింది. దీంతో అస‌లు భార‌త్ ఓడింద‌న్న కార‌ణం క‌న్నా.. ధోనీ బాగా ఆడ‌లేద‌నే అభిమానులు ఎక్కువగా ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

ఐసీసీ వ‌న్డే ప్ర‌పంచ క‌ప్‌లో భాగంగా నిన్న బ‌ర్మింగ్‌హామ్‌లో ఇంగ్లండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌తో భార‌త్ ఓట‌మి పాలైన విష‌యం విదిత‌మే. టోర్నీ ఆరంభం నుంచి ఓట‌మి అంటే ఎరుగ‌ని జ‌ట్టుగా టీమిండియా త‌న జైత్ర‌యాత్ర కొన‌సాగిస్తూ వ‌స్తోంది. కానీ నిన్న‌టి మ్యాచ్‌లో ఓడిపోవ‌డంతో ఆ యాత్ర‌కు బ్రేక్ ప‌డింది. అయితే టీమిండియా ఓడినందుకు కాదు.. ధోనీ బాగా ఆడ‌లేద‌ని ఇప్పుడు నెటిజ‌న్లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. సోష‌ల్ మీడియాలో ధోనీతోపాటు మ‌రో భార‌త ఆట‌గాడు కేదార్ జాద‌వ్‌పైనా నెటిజ‌న్లు పంచ్‌లు వేస్తున్నారు.

నిన్న జ‌రిగిన మ్యాచ్‌లో ధోనీ చివ‌రి ఓవ‌ర్ వ‌ర‌కు ఉన్నాడు. అయితే సాధార‌ణంగా ధోనీ ఉన్నాడంటే.. భార‌త అభిమానుల‌కు ఒక గ‌ట్టి న‌మ్మ‌కం. ఏం చేసైనా స‌రే.. భార‌త్‌ను అత‌ను గెలిపిస్తాడని వారు బ‌లంగా న‌మ్ముతారు. ఆ విష‌యాన్ని ధోనీ గ‌తంలో ప‌లు మ్యాచుల్లో రుజువు చేశాడు కూడా. కానీ నిన్న‌టి మ్యాచ్‌లో మాత్రం ధోనీ చివ‌రి ఓవ‌ర్, చివ‌రి బంతి వ‌ర‌కు ఉన్నా భార‌త్ గెల‌వ‌లేక‌పోయింది. దీంతో అస‌లు భార‌త్ ఓడింద‌న్న కార‌ణం క‌న్నా.. ధోనీ బాగా ఆడ‌లేద‌నే అభిమానులు ఎక్కువగా ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

సోష‌ల్ మీడియాలో ధోనీ, కేదార్ జాద‌వ్‌, టీమిండియా కెప్టెన్ కోహ్లిల‌పై నెటిజ‌న్లు జోకులు పేలుస్తున్నారు. వారికి చెందిన ప‌లు ఫ‌న్నీ ఫొటోల‌ను ట్వీట్ చేస్తూ వారిని ట్రోల్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో భార‌త మాజీ ప్లేయ‌ర్లు కూడా ధోనీ, కేదార్ జాద‌వ్‌ల ఆట‌తీరును త‌ప్పుప‌ట్టారు. చివ‌రి ఓవ‌ర్ల‌లో చేయాల్సిన ప‌రుగులు ఎక్కువ‌గా ఉన్న‌వేళ డాట్ బాల్స్ ఆడుతూ, 1, 2 ప‌రుగులు తీయ‌డం ఏమిట‌ని వారు మండిప‌డుతున్నారు. దీంతో ఫ్యాన్స్ కూడా ఈ విష‌యంపై తీవ్ర ఆగ్రహం వ్య‌క్తం చేస్తూ త‌మ ఆక్రోశాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా వ్య‌క్తం చేస్తున్నారు.

అయితే ఇంగ్లండ్‌తో మ్యాచ్ భార‌త్ కు ముఖ్యం కాక‌పోయినా అటు పాకిస్థాన్‌, శ్రీ‌లంక‌, బంగ్లాదేశ్‌లు కూడా ఇంగ్లండ్ ఓట‌మి కోసం ఆస‌క్తిగా చూశాయి. ఆ దేశాల‌కు చెందిన ఫ్యాన్స్ ఎప్పుడూ లేనిది భార‌త్‌కే నిన్న త‌మ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. అయిన‌ప్ప‌టికీ భార‌త ఆట‌గాళ్లు పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర‌చ‌డంతో ఆ దేశాల ఫ్యాన్స్ కూడా అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే సెమీస్‌లో ప్ర‌వేశానికి భార‌త్‌కు ఇంగ్లండ్‌తో మ్యాచ్ లో విజ‌యం సాధించ‌డం అవ‌స‌రం లేక‌పోయినా మ‌రో రెండు మ్యాచ్‌లు ఉన్న నేప‌థ్యంలో భార‌త క్రికెట్ అభిమానులు కొంత వ‌ర‌కు ఊపిరి పీల్చుకుంటున్నారు. మ‌రి ఆ రెండు మ్యాచ్‌ల ద్వారానైనా భార‌త్ త‌న త‌ప్పుల‌ను తెలుసుకుని సెమీ ఫైనల్‌, ఫైన‌ల్ మ్యాచ్ ల‌ను ఆడి క‌ప్పు సాధిస్తుందా, లేదా.. అన్న‌ది తెలియాలంటే.. మ‌రికొద్ది రోజుల వ‌ర‌కు వేచి చూడ‌క త‌ప్ప‌దు..!

Read more RELATED
Recommended to you

Exit mobile version