20-20 క్రికెట్లో రెండు రోజులు… మూడు వ‌ర‌ల్డ్‌ రికార్డులు

-

టీ-20 క్రికెట్లో…ఒకేరోజున పురుషుల, మహిళల విభాగాలలో జంట ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి. సింగపూర్ వేదికగా సింగపూర్ జట్టుతో ముగిసిన ముక్కోణపు సిరీస్ మ్యాచ్ లో నేపాల్ కెప్టెన్ పారస్ కడ్కే, సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జ‌రిగిన టీ-20 సిరీస్ మ్యాచ్ లో శ్రీలంక కెప్టెన్ చమారీ అటపట్టు సెంచరీలు బాదడం ద్వారా ప్రపంచ రికార్డులు నమోదు చేశారు.

టీ-20 క్రికెట్లో చేజింగ్‌లో సెంచ‌రీ చేసిన తొలి కెప్టెన్‌గా నేపాల్ కెప్టెన్ క‌డ్కే అంత‌ర్జాతీయ రికార్డు సాధించాడు. సింగ‌పూర్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 151 ప‌రుగుల విజ‌య‌ల‌క్ష్యంతో బ్యాటింగ్ చేప‌ట్టిన నేపాల్ 16 ఓవ‌ర్ల‌లోనే 1 వికెట్ న‌ష్టానికి ఈ విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో సెంచ‌రీ బాదిన క‌డ్కే ఛేజింగ్‌లో ఇంట‌ర్నేష‌న‌ల్ టీ-20 క్రికెట్లో సెంచ‌రీ చేసిన ఆట‌గాడిగాను… నేపాల్ త‌ర‌పున సెంచ‌రీ చేసిన తొలి ఆట‌గాడిగాను నిలిచాడు.

మహిళా క్రికెట్లో వీరబాదుడు ప్లేయర్ గా శ్రీలంక ఓపెనర్ చమారీ అటపట్టుకు పేరుంది. వన్డే క్రికెట్లో ఇప్పటికే మెరుపు సెంచరీ సాధించిన చమారీ… ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో మ‌రో సెంచ‌రీ సాధించింది. కేవలం 66 బాల్స్ లోనే 113 పరుగులతో మెరుపు సెంచరీ అందించినా పరాజయం తప్పలేదు. అయితే…టీ-20 చేజింగ్ లో శతకం బాదిన మహిళా తొలి కెప్టెన్ ఘనతను చమారీ సొంతం చేసుకోగలిగింది.

ఇక ఈ రెండు మ్యాచ్‌లు జ‌రిగిన మ‌రుస‌టి రోజే మ‌రో రికార్డు న‌మోదైంది. అంతర్జాతీయ క్రికెట్‌లో పెద్దగా అనుభవం లేని సింగపూర్‌ జట్టు సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ముక్కోణపు టీ20 సిరీస్‌లో భాగంగా ఆదివారం జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో సింగపూర్‌ నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) సభ్యత్వం గల దేశంపై తొలి విజయాన్ని అందుకుని నయా రికార్డును నెలకొల్పింది.

Read more RELATED
Recommended to you

Latest news