టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి పార్టీ అధిష్టానంతో అమీతుమీకి సిద్ధమైనట్లు సమాచారం. పార్టీలో ఇటీవల కాలంలో తనకు అంతగా ప్రాధాన్యత దక్కండంలేదని, సీనియర్లు కూడా తనను ఒంటరిని చేసేందుకు ప్రయత్నిస్తున్నారని రేవంత్ భావిస్తున్నారు. దీంతో ఇక తాడోపేడో తే ల్చుకోవడానికి ఆయన రెడీ అయినట్లు సమాచారం. ఈమేరకు ఢిల్లీకి వెళ్లడం.. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో భేటీ కానుండటంతో కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది.
తెలంగాణ పీసీసీ చీఫ్ పదవిని రేవంత్‌రెడ్డికి అప్పగిస్తారని గతంలో పార్టీలో జోరుగా ప్రచారం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డిని పక్కనబెట్టి.. ఆ స్థానంలో రేవంత్‌కు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగిస్తారని ఊహగానాలు వెలువడ్డాయి. అయితే ఏం జరిగిందో ఏమో కానీ.. అధిష్టానం తన నిర్ణయాన్ని మార్చుకుంది. పీసీసీ ఛీఫ్ మార్పు ఇప్పట్లో లేదనే సంకేతాలచ్చింది. కాగా పార్టీ సీనియర్ల ఒత్తిడి, అడ్డంకులతో నే తనకు పీసీసీ అధ్యక్ష పదవి దక్కకుండా పోయిందని రేవంత్‌రెడ్డి భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా హుజూర్ నగర్ ఉప ఎన్నిక వ్యవహారం రేవంత్‌రెడ్డిని అప్రతిష్ట పాలుచేసింది. అక్కడ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సతీమణి పద్మావతిరెడ్డి అభ్యర్థిత్వాన్ని రేవంత్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. అంతేగాక తన అనుచరుడు కిరణ్‌రెడ్డికే పార్టీ టికెట్ ఇవ్వాలని అధిష్టానంపై ఒత్తిడి కూడా తెచ్చారు. దీంతో సీనియర్ నేతలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ… రేవంత్‌పై ముప్పేట దాడి చేశారు. ఈ క్రమంలోనే పద్మావతి రెడ్డికే హుజూర్‌నగర్ టికెట్ కేటాయించడంతో రేవంత్ తీవ్ర మనస్థాపానికి గురైనట్లు సమాచారం..
ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో రగిలిపోతున్న రేవంత్ రెడ్డి తాజాగా హైకమాండ్‌తో ఇక అమీతుమీకి సిద్ధమైనట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఆయన ఢిల్లీకి వెళ్లి… పార్టీ పెద్దలతో సమావేశం కానున్నారనే వార్త ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్‌లో కలకలం రేపుతోంది. అంతేగాక కాంగ్రెస్ పెద్దలతో పీసీసీ పీఠంపై తాడోపేడో తేల్చుకోవడానికి కూడా రేవంత్‌రెడ్డి రెడీ అయినట్లు సమాచారం. మరి రేవంత్ పార్టీలో ఉంటాడా ? బయటకు వచ్చేస్తాడా ? అన్న చర్చలు కూడా నడుస్తున్నాయి.