ఏపీ ఉద్యోగుల పై ప్రభుత్వ విప్ శ్రీకాంత్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉందని.. హెచ్ ఆర్ఏ వంటి అంశాల పై చర్చల ద్వారానే పరిష్కారం దొరుకుతుందని పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాలు చర్చలకు రాము అని ప్రొవోక్ చేస్తున్నారని మండిపడ్డారు. చర్చలకు రాము మీరేం చేసుకుంటే చేసుకోండి అనే ధోరణి కరెక్ట్ కాదని.. ఉద్యోగులను ప్రభుత్వంలో భాగంగానే ప్రభుత్వం చూస్తోందని చెప్పారు శ్రీకాంత్ రెడ్డి.
జిల్లాల కసరత్తు రాత్రికి రాత్రి చేసింది కాదని.. రాజం పేట, మదనపల్లి జిల్లా కేంద్రం చేస్తే మిగిలిన ప్రాంతాలకు దూరం అవుతుందని పేర్కొన్నారు. రాయచోటి జిల్లాలో అన్ని ప్రాంతాలకు సమ దూరం లో ఉంటుందనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారన్నారు. జిల్లా కేంద్ర ఏర్పాటును ప్రభావితం చేసే శక్తి నాకు లేదని.. అన్నమయ్య, ఎన్టీఆర్, పుట్టపర్తి సాయిబాబా ఒక ప్రాంతానికి పరిమితం అయిన వ్యక్తులు కాదని వెల్లడించారు. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల పొందేందుకే ఆరోపణలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి.