ఆర్థిక, ఆహార సంక్షోభంతో శ్రీలంక కొట్టుమిట్టాడుతోంది. దేశంలో నిత్యావసరాల ధరలు దారుణంగా పెరిగాయి. ప్రజలు వద్ద కొనడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి ఉంది. బియ్యం, పాల పొడి ప్యాకెట్, పండ్ల ధలరు వేలల్లో ఉన్నాయి. దీంతో పాటు పెట్రోల్, డిజిల్ అవసరాలకు తగ్గట్లు అందడం లేదు. పెట్రోల్ బంకుల వద్ద ఆర్మీని సెక్యురిటీగా పెట్టారంటే ఆ దేశ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మరో వైపు విద్యుత్ కోతలతో ప్రజలు సతమతం అవుతున్నారు. దీంతో ప్రజల్లో తీవ్ర అసహనం వ్యక్తం అవుతోంది. దేశరాజధాని కొలంబోతో పాటు అన్ని ప్రధాన నగరాల్లో ప్రజలు ఆందోళనలు, నిరసనలు చేపడుతున్నారు. దేశ అధ్యక్షడు గోటబయ రాజపక్సే, దేశ ప్రధాని మహిందా రాజపక్సేలు గద్దె దిగాలంటూ నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు.
ఇదిలా ఉంటే శ్రీలంకలో మరోసారి పెట్రోల్ రేట్లు పెరిగాయి. దీంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఇంధన ధరలు మునుపెన్నడూ లేని విధంగా పెరిగాయి. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సిలోన్ పెట్రోలియం కార్పోరేషన్ ఒక్క రోజే లీటర్ పెట్రోల్ ధరను రూ. 84 పెంచింది. దీంతో శ్రీలంకలో లీటర్ పెట్రోల్ ధర రూ. 338కి చేరింది. ఇక సూపర్ డీజిల్ లీటర్ ధర రూ. 75కు పెరిగి రూ. 329 అయింది. మరోవైపు ఆటో డిజిల్ ధర రూ.113 పెరగడంతో రూ. 289కి చేరింది. పెరిగిన ధరలు ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి కారణం అవుతోంది. ఈ సంక్షభం నుంచి బయటపడటానికి ప్రపంచదేశాలు, ఐఎంఎఫ్ సాయం కావాలని శ్రీలంక కోరుతోంది.