అధికారం కోల్పోయి ఏడు నెలలైనా బీఆర్ఎస్ పార్టీ పెద్దలు ఇప్పటికీ భ్రమల లోకం నుంచి బయటకు రాలేకపోతున్నారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద చల్లడం ఆపి ఓటమిని సమీక్షించుకోవాలని ఆయన హితవు పలికారు.
ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రభుత్వ లోటుపాట్లను ఎత్తిచూపితే స్వాగతిస్తామని ఆయన తెలిపారు. నిస్సృహతో కూడిన ప్రకటనలతో తమలో ఉన్న గందరగోళాన్ని కప్పిపుచ్చుకోవడం వల్ల ప్రజాప్రయోజనం ఉండదని అన్నారు.రాజకీయ పార్టీల గెలుపు ఓటములను ప్రజలే నిర్ణయిస్తారని,ప్రజాభిమానం ఉన్నంతకాలమే ఏ రాజకీయ పక్షమైనా కొనసాగు తుందని తెలిపారు. ఇంత జరిగినా పార్టీ అధినేత కేసీఆర్ తీరులో ఏమాత్రం మార్పు రాలేదని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. నేలమట్టమైన పార్టీని నాలుగు సంవత్సరాల తర్వాత అధికారంలోకి తీసుకొచ్చి 15 సంవత్సరాలు నిరాటంకంగా పరిపాలిస్తామని చెబుతున్నారని ,ఈ వ్యాఖ్యలు తార్కికతకు దగ్గరగా లేని అందమైన ఊహ అనుకోవాలన్నారు.