ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్ ఆధ్వర్యంలోని పతంజలి (Patanjali) సంస్థ విక్రయిస్తున్న ఆవ నూనెలో నాణ్యత లోపించిందని రాజస్థాన్ ప్రభుత్వం వెల్లడించింది. సదరు నూనె నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేదని తెలియజేసింది. ఈ మేరకు రాజస్థాన్ ప్రభుత్వం ఒక ప్రకటనను విడుదల చేసింది.
సింఘానియా ఆయిల్ మిల్ నుంచి పతంజలికి సరఫరా అవుతున్న ఆవనూనెకు సంబంధించి ఫుడ్ సేఫ్టీ అధికారులు 5 శాంపిల్స్‌ను సేకరించారు. వాటిని టెస్టు చేయగా అవి పరీక్షల్లో ఫెయిలయ్యాయి. ఆ నూనెలో నాణ్యత లేదని, నాణ్యతా ప్రమాణాలను పాటించకుండా నూనెను ఉత్పత్తి చేస్తున్నారని అధికారులు వెల్లడించారు.
మే 27వ తేదీన చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఓమ్ ప్రకాష్ మీనా నేతృత్వంలోని ఫుడ్ సేఫ్టీ అధికారులు శాంపిల్స్‌ను సేకరించి పరీక్షలు నిర్వహించి ఆ నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. అల్వార్‌లో ఉన్న ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ లాబొరేటరీ ఆ నివేదికను రూపొందించింది. పతంజలి ఆవ నూనె ఆయిల్ ప్యాకెట్ల నుంచి నూనె శాంపిల్స్‌ను సేకరించి పరీక్షలు జరిపారు.
పతంజలి సంస్థ విక్రయిస్తున్న ఆవనూనె పౌచ్‌లు, బాటిల్స్‌లోని నూనెలలో నాణ్యతా ప్రమాణాల లోపం ఉందని నిర్దారించారు. అలాగే శ్రీశ్రీ తత్వకు చెందిన ఆవనూనెలో కూడా నాణ్యత లోపించిందని తెలిపారు. అయితే దీనిపై అటు పతంజలి సంస్థ గానీ, ఇటు బాబా రామ్‌దేవ్ గానీ స్పందించలేదు. వారు ఈ విషయంపై ఏం మాట్లాడుతారనేది ఆసక్తికరంగా మారింది. గతంలోనూ పతంజలి సంస్థపై ఇలాగే పలు ఆరోపణలు వచ్చాయి. కానీ అప్పట్లో ఆ విషయం సద్దుమణిగింది. మరి ఈ సారి ఏమవుతుందో చూడాలి.