సాధారణంగా సీజన్ మారినప్పుడల్లా చాలా మంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అయితే సాధారణంగా కొంతమందికి తరచూ గొంతు నొప్పి సమస్య తలెత్తుతుంటుంది. గొంతు నొప్పి నుంచి తొందరగా ఉపశమనం పొందడానికి వైద్యులను సంప్రదిస్తుంటారు. అయితే అందరికీ తెలియని విషయం ఏంటంటే.. మనకు ఇంట్లో లభించే కొన్ని పదార్థాలతో గొంతు నొప్పి వ్యాధిని నయం చేసుకోవచ్చునని నిపుణులు చెబుతున్నారు. గొంతనొప్పి నుండి ఉపశమనం పొందటానికి కింది ఉన్న చిట్కాలను పాటించమని సలహా ఇస్తున్నారు.
గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, అల్లం వంటి పదార్థాలను ఎంతో ఉపయోగపడతాయి. వీటితో మంచి మసాలా టీ తయారు చేసుకుని వేడి వేడిగా తాగాలి. అప్పుడు ఆ మసాలా ఘాటుకి గొంతు నొప్పి ఇట్టే తగ్గిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో కొన్ని అల్లం ముక్కలను వేసుకుని నీటిని బాగా మరిగించాలి. నీరు బాగా మరిగిన తర్వాత చిక్కని అల్లం రసం వస్తుంది. అప్పుడు ఆ రసాన్ని వడబోసి వేడిగా ఉండగానే తాగాలి. ఇలా చేస్తే గొంతు నొప్పి క్షణాల్లో తగ్గుతుంది.
అయితే గొంతు నొప్పి సమస్య ఎక్కువగా ఉంటే.. వేడి వేడిగా చికెన్ సూప్ తయారు చేసుకుని తాగితే.. కొంతవరకు ఉపశమనం పొందవచ్చు. అంతేకాదు.. ఈ చికెన్ సూప్ ఔషధంగా కూడా పనిచేస్తుంది. పలు రకాల ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది. అలాగే, మిరియాలతో చేసిన చారు, లేదంటే మిరియాలు వేసి మరిగించిన పాలను తాగడం వలన కూడా గొంతు నొప్పి సమస్యను నిర్మూలించవచ్చు. జలుబు, దగ్గు వంటి సమస్యలు కూడా మాయమవుతాయి. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, తేనెలను కలుపుకుని తాగాలి. వీటిలో ఉండే సహజ సిద్ధమైన యాంటీ బయోటిక్, యాంటీ వైరల్ గుణాలు గొంతు నొప్పిని తగ్గిస్తాయి. బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. మధుమేహ వ్యాధితో బాధపడేవారు ఈ చిట్కాలను పాటిస్తే తప్పకుండా ఫలితం కనిపిస్తుంది.