నిత్యం మనం ఆయిల్ లేనిదే ఏ వంటా చేయలేం. చాలా మంది అనేక రకాల ఆయిల్స్‌తో నిత్యం వంటలు చేసుకుంటుంటారు. అయితే అధిక శాతం మంది సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను ఉపయోగిస్తుంటారు. ఈ క్రమంలో ఇదే ఆయిల్‌ను అమ్మే హోల్‌సేల్ బిజినెస్ చేస్తే.. చక్కని ఆదాయం వస్తుంది. మరి ఇందుకు ఎంత పెట్టుబడి పెట్టాలో.. ఏ మేర ఆదాయం సంపాదించవచ్చో.. ఇప్పుడు తెలుసుకుందామా..!
సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను విక్రయించే కంపెనీలు మార్కెట్లో అనేకం ఉన్నాయి. అయితే అదే ఆయిల్‌ను హోల్‌సేల్‌గా కొని.. దాన్ని ప్లాస్టిక్ బాటిల్స్‌లో నింపి.. ప్యాకింగ్ చేసి విక్రయించవచ్చు. దీంతో 50 శాతం వరకు ఇందులో లాభం వస్తుంది. సహజంగా మనకు సన్‌ఫ్లవర్ ఆయిల్ హోల్‌సేల్ రేటుకి కేజీ రూ.42 చొప్పున లభిస్తుంది. కానీ దాన్ని బాటిల్స్‌లో ప్యాక్ చేసి అమ్మితే రూ.90 నుంచి రూ.150కి ఆయిల్ క్వాలిటీని బట్టి విక్రయించవచ్చు. దీంతో 50 శాతం వరకు లాభాలు వస్తాయి.
సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను ఢిల్లీ, చెన్నై నగరాల్లో పెద్ద ఎత్తున హోల్‌సేల్‌లో విక్రయిస్తారు. ఆయా మార్కెట్లలో టన్నుకు రూ.42 వేల నుంచి రూ.58వేల వరకు సన్‌ఫ్లవర్ ఆయిల్ లభిస్తుంది. దాన్ని అక్కడ కొనుగోలు చేసి మన దగ్గరికి రవాణా చేయాలి. అక్కడ ఆయిల్‌ను 1 లీటర్, 2 లీటర్లు, 5 లీటర్ల బాటిల్స్‌లో ప్యాక్ చేసి.. దాని మీద స్టిక్కరింగ్ వేయాలి. సొంత కంపెనీ అయితే మీ కంపెనీ బ్రాండ్ లోగో, ఇతర వివరాలతో కూడిన స్టిక్కర్ వేయవచ్చు. అలా ప్యాక్ చేసిన సన్‌ఫ్లవర్ ఆయిల్ బాటిల్స్‌ను హోల్‌సేల్ మార్కెట్లో రూ.75 నుంచి విక్రయించవచ్చు. దీంతో ఖర్చులు పోను ఎంత లేదన్నా ఒక్కో బాటిల్‌పై కనీసం 35 నుంచి 40 శాతం వరకు మార్జిన్ లభిస్తుంది.
ప్యాక్ చేయబడిన సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను హోల్‌సేల్ వ్యాపారులకు, సూపర్ మార్కెట్లకు, కిరాణా స్టోర్స్ వారికి విక్రయించాలి. అందుకు మార్కెటింగ్ చేయాలి. ఇతర కంపెనీలు ఇస్తున్న కమిషన్ కన్నా కొంత ఎక్కువ కమిషన్ ఇస్తే.. వారు మీ సన్‌ఫ్లవర్ ఆయిల్ బాటిల్స్‌ను విక్రయించేందుకు ఆసక్తి చూపిస్తారు. దీంతో తక్కువ కాలంలోనే ఉత్పత్తి ఎక్కువ చేసి.. నెల నెలా రూ.లక్షల్లో ఆదాయం సంపాదించవచ్చు.
ఇక ఈ బిజినెస్‌కు జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేయించాలి. ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ పొందాలి. లోకల్ అథారిటీ పర్మిషన్, ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి. ఇందుకు రూ.50వేల వరకు ఖర్చు అవుతుంది. స్థానికంగా ఉండే ట్యాక్స్ వర్క్ చేసే వ్యక్తులను కలిస్తే ఈ అనుమతులన్నీ వారు తెచ్చి ఇస్తారు. వారికి కమిషన్ ఇస్తే చాలు. ఇలా సన్‌ఫ్లవర్ ఆయిల్ హోల్‌సేల్ బిజినెస్ ద్వారా నెల నెలా చక్కని ఆదాయాన్ని సంపాదించవచ్చు..!