లాయర్ వామన్ రావు దంపతుల హత్య కేసులో రాష్ట్ర సర్కార్‌కు సుప్రీం నోటీసులు

-

పెద్దపల్లి జిల్లాలో గతేడాది జరిగిన లాయర్ వామన్ రావు దంపతుల హత్య కేసుపై సుప్రీం విచారణ చేపట్టింది. తన కుమారుడు, కోడలు దారుణ హత్యకు గురైన ఘటనపై సీబీఐ లేదా మరే దర్యాప్తు సంస్థతోనైనా విచారణ జరిపించాలంటూ వామన్ రావు తండ్రి కిషన్ రావు వేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ జరిపింది. కేసు దర్యాప్తును మరో సంస్థకు అప్పగించే అంశాన్ని పరిశీలించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. రాష్ట్ర ప్రభుత్వానికి, డీజీపీకి నోటీసులు జారీ చేసింది.

పెద్దపల్లి జిల్లా కల్వచర్ల వద్ద 2021, ఫిబ్రవరి 17న తన కుమారుడు, కోడలు దారుణ హత్యకు గురైన ఘటనపై సీబీఐ లేదా మరే దర్యాప్తు సంస్థతోనైనా విచారణ జరిపించాలంటూ వామన్‌రావు తండ్రి కిషన్‌రావు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం దీనిపై విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు.

‘చనిపోయే సమయంలో వామన్‌రావు పుట్ట మధు, పుట్ట శైలజలపై పలు ఆరోపణలు చేసిన వీడియో ఉంది. పోలీసులు మాత్రం మధుకు క్లీన్‌చిట్‌ ఇచ్చారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులే వామన్‌రావుపై 12 బోగస్‌ కేసులు నమోదు చేయగా, వాటిని హైకోర్టు కొట్టివేసింది. అదే పోలీసుల విచారణతో ఈ కేసులో న్యాయం జరగద’ని ధర్మాసనానికి విన్నవించారు. వాదనల అనంతరం ధర్మాసనం.. ఇతర సంస్థలతో దర్యాప్తు అంశాన్ని పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. దీనిపై లిఖితపూర్వక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది.

 

Read more RELATED
Recommended to you

Latest news