స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టపరమైన ధ్రువీకరణ కోరుతూ దాఖలైన పిటిషన్లపై ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం తీర్పును రిజర్వ్ చేసింది. ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు ఎస్‌కే కౌల్, ఎస్‌ఆర్ భట్, హిమా కోహ్లీ, పీఎస్ నరసింహ ఉన్నారు.
స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టపరమైన గుర్తింపు ఇవ్వాలన్న పిటిషన్‌పై ఏడు రాష్ట్రాల నుంచి స్పందన వచ్చిందని కేంద్రం నిన్న (బుధవారం) సుప్రీంకోర్టుకు తెలిపింది. మూడు రాష్ట్రాలు – రాజస్థాన్, అస్సాం మరియు ఆంధ్రప్రదేశ్ – అభ్యర్థనను వ్యతిరేకించగా, మిగిలిన నాలుగు – సిక్కిం, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ మరియు మణిపూర్ – మరింత సమయం కోరాయి. అంతకుముందు మంగళవారం, వివాహం అనేది రాజ్యాంగ హక్కు అని, కేవలం చట్టబద్ధమైన హక్కు కాదని కోర్టు పేర్కొంది.
స్వలింగ వివాహాల చట్టబద్ధతకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో కేంద్ర ప్రభుత్వం తన వాదనలను వినిపించింది. స్వలింగ వివాహాలకు గుర్తింపును ఇచ్చే అంశం చాలా సంక్లిష్టమైనదని కోర్టుకు తెలిపింది. సమాజంపై లోతైన ప్రభావాన్ని చూపించే ఈ అంశాన్ని పార్లమెంటుకు వదిలివేయాలని కోరింది. రాష్ట్రాల చట్టసభలతో పాటు పౌర సమాజంలోను దీనిపై విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.