విడాకులపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

-

విడాకులపై సర్వోన్నత న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలే ఎక్కువగా విడాకుల కోసం న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నాయని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లతో పోలిస్తే ప్రేమ పెళ్లిళ్లలోనే విడాకులు ఎక్కువని పేర్కొంది. ఈమేరకు ఓ జంట విడాకుల కేసు విచారణలో భాగంగా జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సంజయ్ కరోల్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిన ఓ జంటకు మధ్యవర్తిత్వం ద్వారా కాపురాన్ని దిద్దుకోవాలని సూచించింది. అయితే, రాజీకి భర్త ఒప్పుకోకపోవడంతో ఆరు నెలల గడువు నిబంధనను పక్కన పెట్టి విడాకులు మంజూరు చేసింది.

విడాకుల కోసం కోర్టును ఆశ్రయించే జంటలను కలిపి ఉంచేందుకు ప్రయత్నించాలనే ఉద్దేశంతో హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 13బి (2) లో ఆరు నెలల వెయిటింగ్ పీరియడ్ నిబంధన ఉంది. కోర్టును ఆశ్రయించిన జంటలకు ఆరు నెలల్లో తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశం కల్పించింది. గడువు ముగిసిన తర్వాత కూడా కలిసి ఉండలేమని నిర్ణయించుకున్న జంటలకు కోర్టు విడాకులు మంజూరు చేస్తుంది. అయితే, ఇటీవల ఓ కేసులో తీర్పు వెలువరిస్తూ.. విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కే అన్ని జంటలకూ ఆరు నెలల నిబంధన వర్తించదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ తీర్పును ఉదహరిస్తూ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సంజయ్ కరోల్ నేతృత్వంలోని ధర్మాసనం తాజాగా మరో జంటకు విడాకులు మంజూరు చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version