సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మపై సీవీసీ నివేదికలో పేర్కొన్న కొన్ని అంశాలపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. వర్మపై ఆరోపణలు అత్యంత అవమానకరంగా ఉన్నాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలోక్‌వర్మపై సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ ఆస్తానా చేసిన అవినీతి ఆరోపణలపై సీవీసీ దర్యాప్తు జరిపి నివేదికను ఈ నెల 10న పూర్తి చేసి కోర్టుకు అప్పగించింది. నివేదికపై చీఫ్ జస్టిస్ రంజన్‌గగొయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. సీవీసి నివేదికను నాలుగు భాగాలుగా విభజించిన సుప్రీం… మొదటి కేటగిరీలో చేసిన ఆరోపణలు వి చారణకు యోగ్యమైనవని, రెండో కేటగిరీలో చేసిన ఆరోపణలు కొంతవరకు పర్వాలేదని, మూడో రకం ఆరోపణల్లో ఆక్షేపించదగినవని, చివరి కేటగిరీలోని ఆరోపణలు అత్యంత అవమానకరంగా ఉన్నాయని చీఫ్ జస్టిస్ గగోయ్ వ్యాఖ్యానించారు.
సీవీసీ ఆరోపణలపై ఈ నెల 19లోగా సీల్డ్ కవర్‌లో స్పందన తెలియజేయాలని అలోక్‌వర్మను సుప్రీంకోర్టు ఆదేశించింది. అలోక్‌వర్మతోపాటు అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాలకు తమ నివేదికను సీల్డ్ కవర్‌లో ఇవ్వాల్సిందిగా సీవీసీని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే సీవీసీ నివేదికను రాకేశ్ ఆస్తానా కోరగా సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ నివేదికలోని అంశాలు దర్యాప్తు సంస్థ ప్రతిష్టకు సంబంధించినవి కనుక వీటి గోప్యతను కాపాడాలని సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 20న చేపట్టనున్నట్టు తెలిపింది.