బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మృతి కేసు విషయం ప్రస్తుతం సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్న విషయం విదితమే. కోర్టు గురువారం వరకు విచారణను వాయిదా వేసింది. పాట్నా పోలీసులు దర్యాప్తు చేస్తున్న సుశాంత్ కేసును ముంబైకి బదిలీ చేయాలని రియా చక్రవర్తి కోరగా.. అన్ని వర్గాల వాదనలను విన్న కోర్టు తీర్పును గురువారానికి రిజర్వ్ చేసింది. అయితే తాజాగా రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సంచలన ఆరోపణలు చేశారు.
సుశాంత్ సింగ్‌ను స్టన్ గన్‌తో హత్య చేశారని, కనుక ఈ కేసును సీబీఐతోపాటు ఎన్ఐఏ కూడా దర్యాప్తు చేయాలని సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. సాధారణంగా స్టన్ గన్‌లను మనుషులను కొంతసేపు పారాలైజ్ చేసేందుకు ఉపయోగిస్తారని.. అయితే సుశాంత్‌ను కూడా అదే గన్‌తో పారాలైజ్ చేసి తరువాత అతనికి ఉరి వేసి చంపి ఉంటారని ఆయన అన్నారు. సుశాంత్ మెడపై ఎడమ వైపు ఉన్న ముద్రలు స్టన్ గన్‌తో పడినవే అని అన్నారు.
అయితే సుబ్రహ్మణ్య స్వామి పెట్టిన పోస్టును పలువురు డాక్టర్లు కూడా సమర్థిస్తున్నారు. స్టన్ గన్‌తో సరిగ్గా శరీరంపై అలాంటి ముద్రలే పడతాయని, కనుక సుశాంత్ ను స్టన్ గన్‌తో చంపి ఉండవచ్చని అంటున్నారు. ఇక ఆ గన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఎవరు తెచ్చారు.. అనే వివరాలపై ఎన్ఐఏతో దర్యాప్తు చేయించాలని సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. కాగా ఇప్పటికే రియా చక్రవర్తి, ఆమె సోదరుడికి చెందిన ఫోన్లు, ట్యాబ్‌లు, ఇతర డివైస్‌లను ఈడీ సీజ్ చేసింది. సుశాంత్ అకౌంట్లలో ఉన్న రూ.15 కోట్లు ఏమైపోయాయి అనే నేపథ్యంలో ఈడీ కేసు దర్యాప్తు చేస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే పలు మార్లు రియా, ఆమె సోదరుడు ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు.
కాగా సుశాంత్‌ను రియా చక్రవర్తి, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే కుమారుడు, మంత్రి ఆదిత్య థాకరే.. ఇద్దరూ కలిసి చంపారని.. కనుక ఈ విషయమై సీబీఐతోపాటు ఎన్ఐఏతోనూ విచారణ జరిపించాలని స్వామి డిమాండ్ చేశారు.