ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు గాను సిద్ధమవుతున్న వేళ రాజస్థాన్ రాయల్స్ జట్టుకు షాక్ తగిలింది. ఆ జట్టు ఫీల్డింగ్ కోచ్ దిశంత్ యగ్నిక్ కరోనా బారిన పడ్డారు. దుబాయ్‌లో జరగనున్న ఐపీఎల్‌కు ఆగస్టు 20వ తేదీ తరువాత ఫ్రాంచైజీలు బయల్దేరనున్న సంగతి తెలిసిందే. అయితే బీసీసీఐ ఇప్పటికే జట్టు సభ్యులందరినీ 2 సార్లు కరోనా టెస్టు చేయించుకోవాలని ఆదేశించింది. అందులో భాగంగానే ఫ్రాంచైజీలు తమ ప్లేయర్లు, ఇతర సిబ్బందికి కరోనా టెస్టులు చేస్తున్నాయి. ఈ క్రమంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఫీల్డింగ్ కోచ్ దిశంత్ కు కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయింది.
అయితే దిశంత్ ప్రస్తుతం ఉదయ్‌పూర్‌లో ఓ హాస్పిటల్‌లో కోవిడ్ చికిత్స తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో 14 రోజుల అనంతరం మళ్లీ రెండు సార్లు అతను టెస్టులు చేయించుకోవాలి. ఆ రిపోర్టుల్లో నెగెటివ్ అని వస్తే అతను దుబాయ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుతో చేరవచ్చు. అయితే అక్కడికి వెళ్లాక కూడా అతను మరో 3 సార్లు టెస్టులు చేయించుకోవాలి. ఆ రిపోర్టుల్లోనూ నెగెటివ్ రావాలి. అలాగే అక్కడ 6 రోజుల పాటు సెల్ఫ్ ఐసొలేషన్‌లో ఉండాలి. తరువాతే అతన్ని జట్టుతో కలిసేందుకు అనుమతిస్తారు.
కాగా సెప్టెంబర్ 19వ తేదీ నుంచి ఐపీఎల్ దుబాయ్‌లో జరగనున్న నేపథ్యంలో బీసీసీఐ అన్ని పకడ్బందీ జాగ్రత్తలు తీసుకుంటోంది. ఒక్క ప్లేయర్ లేదా సిబ్బందికి కరోనా వచ్చినా టోర్నీ ఇబ్బందుల్లో పడే అవకాశం ఉన్నందున 100 శాతం కఠినమైన నిబంధనలతో బీసీసీఐ టోర్నీని నిర్వహించాలని చూస్తోంది. అయితే తాజాగా రాజస్థాన్ రాయల్స్ కోచ్ కరోనా బారిన పడడం చర్చనీయాంశమవుతోంది.