కాలం కలిసి రావడం అనేది సాధారణ జీవితాల్లో సాధారణ మానవులకే కాదు.. పేరెన్నికగన్న రాజకీయాల్లో కూడా కాలం కలిసి రాకపోతే.. నాయకుడు బలాదూర్ అవుతారు. గతంలో మా తాతలు నేతలు తాగారని చెప్పుకొంటే ఏంటి ప్రయోజనం. ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? అనే ప్రశ్నలు వస్తాయి. ఇలాంటి ప్రశ్నల చిక్కుల్లో మునిగిపోయారు వైఎస్సార్ సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన ఈయనకు ఇప్పుడు టైం అస్సలు కలిసి రావడం లేదని అంటున్నారు. 2014లో గెలుపు గుర్రం ఎక్కుతారని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే, పుల్లారావు ఈయన అవకాశాన్ని కొట్టేశారు.
ఇక, ఎన్నో ఏళ్లు కష్టపడి.. పార్టీని పుంజుకునేలా చేసిన ఈయన గత ఎన్నికల్లో అయినా గెలుపు గుర్రం ఎక్కాలని అనుకున్నారు. కానీ, ఇంతలో విడదల రజనీ రూపంలో వచ్చి మర్రి అవకాశాన్ని ఎగరేసుకుపోయారు. పోనీ.. జగన్ హామీ ఇచ్చిన ఎమ్మెల్సీ, మంత్రి పదవులు కూడా ఊరిస్తున్నాయే తప్ప అందిరావడం లేదు. తాజాగా ఎమ్మెల్సీ దక్కుతుందని అనుకున్నారు. గవర్నర్ కోటాలో రెండు సీట్లలో ఒకటి రాజశేఖర్‌కు ఖాయం అనుకున్నారు. అయితే ఆ రెండు జకియాతో పాటు పండుల రవీంద్రబాబుకు ఇచ్చారు.
ఇక ఇప్పుడు మళ్లీ ఆయనకు ఎమ్మెల్సీ వచ్చినట్టే వచ్చి చేజారింది. ఎలాగూ జగన్ హామీ ఇచ్చారు కాబట్టి.. రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ సీటుకు ఆయనను ఎంపిక చేస్తారని మంత్రి పదవి ఇచ్చినా.. ఇవ్వకపోయినా.. ఏదొ ఒకటి ఇచ్చి సంతృప్తి పరుస్తారని అనుకున్నారు. కానీ, ఈ అవకాశం కూడా ఎగిరిపోయిందని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. విజయనగరం జిల్లాకు చెందిన పెన్మత్స సాంబశివరాజు ఇటీవల అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. అయితే ఆ కుటుంబానికి న్యాయం చేయాలని భావించిన సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
పెన్మత్స తనయుడు డాక్టర్ పెన్మత్స సూర్య నారాయణరాజు (సురేష్)ను ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దింపాలని సీఎం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నెల 13న సురేష్ నామినేషన్ వేయనున్నట్లు సమాచారం. వాస్తవానికి ఈ టికెట్‌ను మొదట సీనియర్ నేత మర్రి రాజశేఖర్‌కు ఇవ్వాలని జగన్ భావించారు. అయితే సాంబశివరాజు మరణంతో చివరి నిమిషంలో సురేష్‌కు అవకాశం దక్కినట్లు తెలియవచ్చింది. మొత్తానికి ఇంతకన్నా.. దురదృష్టం ఏముంటుందని అంటున్నారు పరిశీలకులు. నిజమేగా మరి..!!