పండగ సందర్భంగా ఇంటికే బస్సు పంపనున్న టీ సర్కార్..

సంక్రాంతి పండగ వచ్చేస్తుంది. పల్లెల్లో పండగ సంబరాలు మొదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో పల్లెకి పోవడానికి రెడీ అవుతున్నారు. పట్టణాల్లో పడిన పని భారం నుండి పల్లెల్లోకి వెళ్ళి, నూతన ఉత్సాహంతో తిరిగిరావడానికి బస్సెక్కుతున్నారు. హైదరాబాద్ నుండి వందల సంఖ్యలో బస్సులు పల్లెకి బయలు దేరుతున్నాయి. దాంతో బస్టాండులన్నీ కిటకిటలాడుతున్నాయి. రోడ్ల మీద ట్రాఫిక్ ఎక్కువవుతుంది. అందువల్ల బస్టాండుకి వెళ్ళడానికి కూడా ఇబ్బందిగా మారింది.

ఈ విషయాన్ని గమనించిన టీ సర్కార్, సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. పండగ కోసమని పల్లెకి బయల్దేరే వారికోసం వారి ఇంటి ముందుకే ఆర్టీసీ బస్సుని పంపిస్తుంది. అంటే ఇంటి ముందు ఎక్కి డైరెక్టుగా పల్లెలో దిగిపోవడమే. ఐతే ఒక ఏరియాలో కనీసం 30మంది ప్రయాణికులు ఉండాలట. అదీగాక అదనంగా 30శాతం ఛార్జీలు వసూలు చేస్తున్నారట. మరి ఈ సరికొత్త ఆలోచన ఎంత మేర వర్కౌట్ అవుతుందో చూడాలి.