జీవితం చాలా పెద్దది అంటుంటారు కొంతమంది. కొంతమందేమో చాలా చిన్నది అని చెబుతుంటారు. నిజం ఏంటనేది నువ్వు జీవించే విధానం మీద ఆధారపడి ఉంటుంది. ఐతే ఎవరు ఎలా జీవించినా, జీవితంలో కొన్ని జరిగే సంఘటనలు అందరికీ కామన్ గా ఉంటాయి. అలాగే కొన్ని విషయాలు మనం ఒప్పుకోవాల్సినవి కూడా ఉంటాయి. అవి చేదుగా ఉన్నా కూడా నిజ జీవితంలో జరిగే సంఘటనలని ఒప్పుకుని తీరాల్సిందే. అలాంటి పరిస్థితులు ఏంటో ఇక్కడ చూద్దాం.
మీకేదైనా మంచిగా అనిపించినపుడు అది పూర్తిగా మంచిదైపోదు. ఒక వ్యక్తిని మీరు కలిసారు. మంచివాడిలా అనిపించింది. అలా అనుకున్నంత మాత్రాన అతను పూర్తిగా మంచివాడైపోడు. పరిస్థితుల కారణంగా ఎవరు మంచి ఎవరు చెడు అనేది తెలుస్తుంది తప్ప, కేవలం మీకు మంచిగా అనిపించినంత మాత్రాన వాళ్ళు మంచివాళ్ళైపోరు.
కొంతమంది 18ఏళ్లకే ముసలివాళ్ళలా ఆలోచిస్తారు. మరికొందరు 90ఏళ్ళు వచ్చినా యవ్వనంగా ఆలోచిస్తారు.
మిమ్మల్ని మీరు తిట్టుకుంటూ, మీకు మీరు సారీ చెప్పుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. గతాన్ని ఎవ్వరూ మార్చలేరు. గతం ఎంత చెడ్డదైనా అది జరిగిపోయింది కనుక ఆలోచించడం అనవసరం. కాబట్టి, పాజిటివ్ గా ఉండి, ముందుకు సాగిపోవాల్సిందే.
మీ పిల్లలు చెప్పే చిన్న విషయాలని కూడా వినండి. లేదంటే పెద్ద విషయాలను కూడా చెప్పడం మానేస్తారు.
మీ చుట్టూ ఉన్నవారి ప్రభావం మీ మీద ఖచ్చితంగా ఉంటుంది. అందుకే మీ చుట్టూ ఎవరుండాలనేది మీరే నిర్ణయించుకోవాలి.
మీకు తెలియని తెలివితేటలు మీలో చాలా దాగున్నాయి. వాటిని నిద్రపుచ్చడం మానేసి, తొందరగా మేల్కొండి.