ప్రయాణికులకు మరింత చేరువ అయ్యేందుకు వినూత్న ప్రయోగాలు చేస్తున్న టీఎస్ ఆర్టీసీ తాజాగా ‘టి9-30 టికెట్’ పేరుతో మరో రాయితీ పథకం అందుబాటులోకి తీసుకువచ్చింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్వల్ప దూరం ప్రయాణించే వారి కోసం పల్లె వెలుగు బస్సుల్లో కొత్తగా ‘టి9-30 టికెట్’ను ప్రవేశపెట్టినట్లు ఆర్టీసీ ఛైర్మన్, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, సంస్థ ఎంపీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. బుధవారం సంస్థ అధికారులతో కలిసి టీ9-30 టికెట్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
రూ.50 ఛార్జీతో పల్లె వెలుగులో టిక్కెట్ తీసుకొని 30 కిలో మీటర్లు రాను, పోను ప్రయాణించవచ్చు. ఉదయం తొమ్మిది గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు ఇది చెల్లుబాటు అవుతుంది. ఈ టీ9-30 టిక్కెట్ రేపటి నుండి అందుబాటులోకి వస్తోంది. దీంతో ఒక్కొక్కరికి రూ.10 నుండి రూ.30 వరకు ఆదా అవుతుంది. పల్లె వెలుగు కోసం ఈ టిక్కెట్ తీసుకున్న తర్వాత ఎక్స్‌ప్రెస్ లోను ప్రయాణించే వెసులుబాటు ఉంది. అయితే రూ.20 కాంబినేషన్ టిక్కెట్ తీసుకొని ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణించవచ్చు.