తమిళ నటుడు విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న 800 సినిమా పోస్టర్ నిన్ననే రిలీజైంది. శ్రీలంక మాజీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి, మురళీధరన్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఐతే ఈ సినిమాపై తమిళులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి ముఖ్య కారణం శ్రీలంకలో తమిళులపై దాడులే. గతంలో శ్రీలంకలో తమిళుల ఊచకోత జరిగిన సంగతి అందరికీ తెలిసిందే.
అదే ఇప్పుడు 800సినిమాపై ఆగ్రహం తెప్పించేలా చేస్తున్నాయి. టెస్టుల్లో 800వికెట్లు తీసిన ఆటగాడి జీవిత కథని తెరమీద చూపించడానికి సిద్ధమవుతున్న విజయ్ సేతుపతిపై విమర్శలు చేస్తున్నారు. భారతీయ తమిళుడివై ఉండి శ్రీలంక ఆటగాడి కథలో నటిస్తావా, అందుకోసం శ్రీలంక జెండా మోస్తావా అంటూ విమర్శిస్తున్నారు. సినిమా ఇంకా మొదలు కాకముందే మొదలైన ఈ విమర్శలు తగ్గుతాయో లేదో చూడాలి.