తమిళనాడు అన్నాడీఎంకేలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. సీఎం సీటు కోసం ఇరువర్గాలు పట్టుబిగించడంతో రాష్ట్ర రాజకీయాలు ఉన్నట్టుండి వేడెక్కాయి. పన్నీర్ సెల్వం, పళనీస్వామి వర్గాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. సీఎం అభ్యర్థిపై నిర్ణయం తీసుకునేందుకు ఈ నెల 6న అన్నాడీఎంకే అత్యవసర సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి పార్టీకి చెందిన శాసనసభ్యులంతా తప్పకుండా హాజరుకావాలంటూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. గత 3 నెలలుగా సీఎం అభ్యర్థిగా ఎవరిని ప్రకటించాలనే విషయమై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఓ వర్గం ప్రస్తుత ముఖ్యమంత్రి పళనీస్వామిని సీఎంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తోంది. మరోవర్గం పన్నీర్‌సెల్వంను ఈ సారి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఘనవిజయం సాధిస్తుందని చెబుతోంది. మంత్రివర్గం కూడా రెండు వర్గాలుగా విడిపోవడంతో రాజకీయంగా వాతావరణం హీటెక్కింది.
ఈ నెల 28న అన్నాడీఎంకే కార్యనిర్వాహక కమిటీ సమావేశంలోనూ సీఎం అభ్యర్థి విషయమై ఎడప్పాడి, పన్నీర్‌సెల్వం మధ్య తీవ్ర వాగ్వాదాలు జరిగాయి. మాజీ ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత విశ్వాసపాత్రుడిని కనుకనే తనను ఆమె రెండు సార్లు ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టారని పన్నీర్‌సెల్వం ప్రకటించారు. వెంటనే ఎడప్పాడి బదులిస్తూ ఇరువురికీ సీఎం పదవి కట్టబెట్టింది జయలలిత సన్నిహితురాలు శశికళేనని తెలిపారు. అంతటితో ఆగకుండా సీఎంగా సమర్థవంతంగా పనిచేస్తున్న తనకు బదులు మరొకరిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎలా ఎంపిక చేయగలుగుతారంటూ ప్రశ్నించారు. ఇలా ఇద్దరి మధ్య గంటకు పైగా వాదోప వాదాలు జరిగాయి. చివరకు సీనియర్ మంత్రులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు.