గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై వైసీపీ ఎమ్మెల్యే వంశీ అనుచరులు చేసిన దాడి రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్తలకు దారి తీసింది. ఈ ఘటనతో ఏపీ వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. దాడి జరిగిన విషయం తెలుసుకొని గన్నవరం వెళ్లినపార్టీ నేత పట్టాభిరామ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పట్టాభి కనిపించకపోవడంపై ఆయన భార్య ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
టీడీపీ నేత పట్టాభి ఎక్కడ ఉన్నారో ఆచూకీ తెలపాలంటూ డీజీపీ ఇంటి ముందు నిరాహారదీక్షకు బైక్‌పై బయల్దేరిన ఆయన భార్య చందనను పోలీసులు అడ్డుకున్నారు. పట్టాభిని మధ్యాహ్నం గన్నవరం కోర్టుకు తీసుకొస్తామని పోలీసులు ఆమెకు వివరించారు. భర్తతో వీడియో కాల్ మాట్లాడించాలని చందన కోరగా పోలీసులు అందుకు నిరాకరించారు. దీంతో తన నివాసంలోనే చందన ఆందోళనను కొనసాగించారు. కాగా చందనను వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఫోన్‌లో పరామర్శించి మద్దతు తెలిపారు.
‘‘టీడీపీ కార్యాలయంపై దాడి విషయం తెలిసి నా భర్త గన్నవరం కార్యాలయానికి వెళ్లారు. అక్కడికి వెళ్లిన ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నా భర్తను ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు. ఆయనకు ఏం జరిగినా సీఎం, డీజీపీదే బాధ్యత’’ అని పట్టాభి భార్య అన్నారు.