గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై గఎమ్మెల్యే వంశీ అనుచరులు చేసిన దాడి ఘటన నేపథ్యంలో.. రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. దాడి జరిగిన విషయం తెలుసుకొని గన్నవరం వెళ్లినపార్టీ నేత పట్టాభిరామ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు విజయవాడలో టీడీపీ నేత బుద్దా వెంకన్న నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
తెలుగుదేశం కార్యాలయంపై దాడికి నిరసనగా గన్నవరం వెళ్లేందుకు సిద్ధమైన బుద్దా వెంకన్నను పోలీసులు అడ్డుకున్నారు. బుద్దా బయటికి రాకుండా ఇంటి గేటు మూసేశారు. దీనిపై బుద్దా వెంకన్న సహా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. నిరసనలను అడ్డకోవడం సరికాదన్నారు. ఖబడ్దార్ వంశీ అంటూ నినాదాలు చేశారు. జగన్ మెప్పు కోసం చంద్రబాబు సహా ఆయన కుటుంబ సభ్యులపై అడ్డగోలుగా మాట్లాడటం, తెలుగుదేశం కార్యాలయంపై దాడులు చేయడం దారుణమని మండిపడ్డారు.
‘టీడీపీ కార్యాలయం ధ్వంసం చేసి ఎదురుదాడులు చేస్తారా..? ఎన్టీఆర్ విగ్రహం వద్దకు వెళ్తుంటే నన్ను అడ్డుకున్నారు. కొడాలి నాని, వంశీకి ఇదే చెబుతున్నా.. వ్యక్తిగత దూషణలు మానండి. వైసీపీలో ఎంత ఎక్కువ దాడులు చేస్తే వారికి టికెట్లు ఇస్తారు. పార్టీ టికెట్లు కోసమే మాపై వ్యగ్తిగత దూషణలు చేస్తున్నారు.’ – బుద్దా వెంకన్న, టీడీపీ నేత