ఇంతోటిదానికి మహానాడెందుకు బాబూ?

-

తెలుగుదేశం పార్టీ మహానాడు సమావేశాలు రెండ్రోజుల పాటు జరుగుతాయి. ఏటా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చే పార్టీ నేతలు, కార్యకర్తల సందడి ఈసారి కరోనా దెబ్బతో కనిపించకుండా పోయింది. ప్రస్తుతం తన రాజకీయాలనే ఆన్ లైన్ లో ప్లాన్ చేసుకున్న బాబు… మహానాడు ను సైతం ఆన్ లైన్ లోనే నడిపిస్తున్నారు! పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, ముఖ్యులు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఇందులో పాల్గొంటుండగా… మిగిలిన నేతలంతా ఎవరి ఇంట్లోనే వారుండి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారానే పాలుపంచుకోనున్నారు. ఆ సంగతులు అలా ఉంటే… ఈ కార్యక్రమంలో మొత్తం 13 తీర్మానాలుచేయగా.. వాటిపై 39 మంది వక్తలు ప్రసంగించనున్నారు! ఇంతకూ ఆ తీర్మానాలు ఏమిటి.. వాటికోసమే అయితే మహానాడే ఎందుకు అనే అంశాలపై తాజాగా తీవ్ర చర్చనడుస్తుంది!

సాధారణంగా మహానాడులో పార్టీ అభివృద్ధి ఎలా అనే అంశంపై చర్చ జరగాలి. 2019లో వచ్చిన ప్రజాతీర్పు విషయంలో ఆత్మపరిశీలనపై చర్చ జరగాలి. ఎక్కడ తప్పులు జరిగాయి.. 23 సీట్ల ఫలితానికి సంబందించిన పాపంలో ఎవరి వాటా ఎంత? 71ఏళ్లల వయసులో బాబు బాధ్యతలు లోకేష్ కు అప్పచెప్పే ఆలోచన ఏమైనా ఉందా? ఎంతో మంది నాయ‌కుల‌ను స‌మాజానికి అందించిన పార్టీకి భ‌విష్య‌త్ లీడ‌ర్ ఎవ‌రనే పరిస్థితి రావడం కాస్త ఇబ్బందికర పరిస్థితే అయినా.. దీనిపై కూడా చర్చ జరగాలి.. కార్యకర్తల అభిప్రాయాలు తీసుకోవాలి! ఇలా పార్టీ మనుగడ కాపాడుకోవడానికి సంబందించిన అంశాలవల్ల పార్టీకి కచ్చితంగా మేలుజరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ… ఈ మహానాడు మొత్తం ఆత్మ స్తుతి, ప‌ర‌నింద‌ల‌ పద్దతిలోనే సాగనుంది. అందుకు వారు ఎంచుకున్న అంశాలే కారణం! అరాచక పాలనకు ఏడాది-ప్రమాదంలో ప్రజాస్వామ్యం, అన్నదాత వెన్నువిరిచిన సర్కార్‌, మాట తప్పిన జగన్‌, సంక్షోభంలో సాగునీటి రంగం, పోలీసువ్యవస్థ దుర్వినియోగం, ప్రజా రాజధాని అమరావతి-మూడు ముక్కలాట, టీటీడీ ఆస్తుల అమ్మకం అంశాలపై తొలి రోజు చర్చ ఉంటుంది.

సరిగ్గా గమనిస్తే… ఇవన్నీ రాజకీయ విమర్శలకు ఉపయోగపడే అంశాలే తప్ప, పార్టీకి టానిక్ గా పనిచేసే మహానాడు వంటి కార్యక్రమాల్లో చర్చించే అంశాలు కాదు! ఎందుకంటే… ఇంతకాలం జూం యాప్ లో బాబు చేసిన రాజకీయ ప్రసంగాలన్నీ ఈ కోవలోవే! అంతకు మించి ఈ మహానాడులో పార్టీకి పనికొచ్చే ఒక్క సరైన తీర్మానం కూడా లేనట్లే లెక్క! దీంతో… ఇంతోటి దానికి మహానాడు ఎందుకు బాబూ… ప్రెస్ మీట్ పెట్టి తలో మైక్ తీసుకుంటే చాలు కదా అనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి!!

Read more RELATED
Recommended to you

Latest news