కిందపడ్డా పైచేయే అంటున్నారు టీడీపీ నేతలు. రాజకీయాల్లో సహజంగా ప్రజలకు ఏమీ తెలియనప్పడు .. ప్రజలకు అవగాహన లేనప్పుడు మాత్రమే ఇలాంటి రాజకీయాలు చేస్తారు. కానీ, ఇప్పుడు అరచేతిలో స్మార్ట్ ఫోన్లు వచ్చాక. ప్రజలకు అంతా నిముషాల్లో తెలిసిపోతోంది. ఎక్కడ ఏం జరుగుతున్న వారికి తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలో ఇంకా ప్రజల కళ్లకు గంతలు కట్టాలనే వ్యూహంతో చంద్రబాబు వ్యవహరించడంపై విమర్శలు రాకుండా ఉంటాయా? ఇప్పుడు సోషల్ మీడియాలో ఇలాంటి విమర్శలే వస్తున్నాయి. విషయంలోకి వెళ్తే.. తాజాగా జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఎస్సీ వర్గానికి చెందిన వర్ల రామయ్య ఓడిపోయారు.
టీడీపీ తరఫున వర్ల రామయ్య ఓ 25 వేలు నామినేషన్ ఫీజు కట్టి(పార్టీనే ఇచ్చిందని టాక్) పోటీకి దిగారు. వాస్తవానికి రాజ్యసభ ఎన్నికల్లో నెగ్గాలంటే బలం ఉండాలి. కానీ, ఈ బలం టీడీపీకి లేదు. అయినా కూడా చంద్రబాబు వర్ల రామయ్యను వ్యూహాత్మకంగా దింపారు. కానీ, ఇది వికటించింది. ఆయన ఓడిపోయారు. ఈ విషయం సభ్య సమాజానికి అందరికీ తెలిసిన విషయమే. అయినా కూడా చంద్రబాబు ఆయన పరివారం మాత్రం నైతికంగా తాము విజయం సాధించామని డబ్బా కొట్టుకుంటున్నారు. రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు.. దీనిపై మాట్లాడుతూ.. మేం నైతిక విజయం సాధించామని చెప్పుకొచ్చారు.
కిందపడ్డా పైచేయి అనే దానికి ఇంత కన్నా రుజువు ఏముంటుంది. ఇక, పార్టీ నుంచి గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి దూరమయ్యారు. వీరిలో వంశీ ఒకరు. అయితే, వీరిని తమ దారిలోకి తెచ్చుకోవాలని భావించిన చంద్రబాబు.. విప్ జారీ చేయించి మరీ .. వారిని రాజ్య సభ ఎన్నికల్లో టీడీపీ తరఫున ఓటు వేయించుకునేందుకు ప్రయత్నించారు. అయితే, వారు ఎన్నికల్లో ఓటైతే వేశారు కానీ.. అది చెల్లకుండా పోయేలా వ్యూహం రచించుకున్నారు. అయితే, ఇది కూడా తమ విజయం గానే టీడీపీ నేతలు చెబుతున్నారు. తాము వారిని తమ దారిలోకి తెచ్చుకున్నామని, విప్ జారీ చేశామని, వారి ఆటలను చెల్లనివ్వబోమని జిల్లా పార్టీ అధ్యక్షులు పెద్ద ఎత్తున ప్రకటనలు చేస్తున్నారు. మొత్తానికి ఇలాంటివి చూస్తే.. కిందపడ్డా పైచేయి అనే సూత్రం.. టీడీపీకి బాగా నప్పినట్టుందే అంటున్నారు పరిశీలకులు.