ఏపీలో పెరిగిన బస్సు ఛార్జీలు నేటి నుంచి అమల్లోకి రాబోతున్నాయి. ఇందుకు సంబంధించి ఏపీఎస్ ఆర్టీసీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పల్లె వెలుగు బస్సులో కిలోమీటర్‌కు రూ. 10 పైసలు పెంచారు. ఎక్స్‌ప్రెస్, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీల్లో కిలోమీటర్‌కు రూ. 20 పైసలు, ఇంద్ర, ఏసీ, గరుడ, అమరావతి బస్సుల్లో కిలోమీటర్‌కు రూ. 10 పైసలు పెంచారు. వెన్నెల స్లీపర్ బస్సుల్లో మాత్రం చార్జీలు పెంచలేదు. అయితే రాష్ట్రంలో ఆర్టీసీ ఛార్జీల పెంపును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నేతలు అసెంబ్లీ వద్ద నిరసన చేపట్టారు.
ఈ కార్యక్రమంలో చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. పెంచిన ఛార్జీలు వెంటనే తగ్గించాలంటూ ఫ్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. మంగళగిరి నుంచి సచివాలయం వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన లోకేష్ మాట్లాడుతూ మంగళగిరి నుంచి సచివాలయానికి రూ. 10 ఉన్న టిక్కెట్‌ను రూ. 15 చేశారని, ఒకేసారి ఐదు రూపాయలు పెంచారని విమర్శించారు. కాగా అసెంబ్లీ సమావేశాలు మూడోరోజుకు చేరుకున్నాయి.