మహారాష్ట్రలో దారుణం.. ఉపాధ్యాయురాలిపై పెట్రోల్‌పోసి నిప్పుపెట్టిన విద్యార్థులు

-

ఒకప్పుడు గురువులంటే విద్యార్థుల్లో గౌరవభావంతో కూడిన భయం ఉండేది. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఉపాధ్యాయులకు ఎంతో గౌరవం ఇచ్చేవారు. కానీ, ఇప్పుటి పరిస్థితులు అందుకు భిన్నంగా తయారయ్యాయి. కొందరు విద్యార్థులు గురువులను ఏ మాత్రం గౌరవించకపోగా వారిపై భౌతికదాడులకు పాల్పడుతున్నారు. చివరికి హత్యచేయడానికి కూడా వెనుకాడటంలేదు.

మహారాష్ట్రలోని వాద్రా జిల్లా దరోడా గ్రామంలో అలాంటి దారుణమే జరిగింది. ఆ గ్రామంలోని పాఠశాల విద్యార్థులే తమ ఉపాధ్యాయురాలిపై పెట్రోల్‌పోసి నిప్పింటించారు. వెంటనే పాఠశాల సిబ్బంది మంటలను ఆర్పేసి.. బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం 67 శాతం కాలిన గాయాలతో ఆ ఉపాధ్యాయురాలు నరకయాతన అనుభవిస్తున్నది. వాద్రాలోనే వారం క్రితం ఒక కాలేజీ అధ్యాపకురాలిని విద్యార్థులు తగులబెట్టిన ఘటనను మరువకముందే తాజా ఘటన చోటుచేసుకోవడం ఆందోళనకరమైన విషయం.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పాఠశాలలోని ఇతర విద్యార్థులు, సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు. ఘటనకు బాధ్యులైన ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాక్రే కూడా ఘటనపై సీరియస్‌గా స్పందించారు. కేసును ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో విచారించి నిందితులకు త్వరగా శిక్షపడేలా చేయాలని ఆదేశించారు. అటు ఆస్పత్రికి వెళ్లి బాధితురాలిని పరామర్శించారు.

కాగా, తల్లిదండ్రుల పెంపకంలో లోపమే విద్యార్థుల్లో ఇలాంటి చెడు స్వభావం పెరగడానికి కారణమవుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. పిల్లలను స్కూల్లో చేర్పించి చేతులు దులుపుకోవడం కాకుండా, ఇంటి దగ్గర వారికి మంచి, చెడులకు తేడా తెలిసేలా, మానవత్వాన్ని పెంచేలా పేరెంట్స్‌ నీతిని బోధించాలని, అప్పుడే విద్యార్థుల్లో మంచి సంస్కారం అలవడుతుందని వారు సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news