శుభాకాంక్షలు: తనను తాను పాలించుకోవడం మొదలై ఆరేళ్లు!

-

తెలంగాణ తనను తాను పాలించుకోవడం మొదలు పెట్టి ఆరేళ్లు గడిచింది. 1948లో హైదరాబాద్ రాష్ట్రం మూన్నాళ్ల ముచ్చటగా మారిపోయి, ఆంధ్రప్రదేశ్‌లో విలీనం తరువాత సుమారు ఆరున్నర దశాబ్దాల తరువాత తనను తాను పాలించుకోవడం మొదలై ఆరేళ్లు గడుస్తోంది. ఈ ఆరేళ్లలో ఏం సాధించారు అని ప్రశ్నిస్తే, స్వేచ్ఛగా తనను తాను పాలించుకోవడమే అన్నింటికన్నా గొప్ప విజయం అని ఈ గడ్డ చెబుతుంది. ఈ విజయాన్ని తెలంగాణ సొంతం చేసుకుంది. అలా అని సాగుతున్నది అల్లాటప్పా పాలన కాదు… దేశంలోని మొత్తం రాష్ట్రాలన్నీ తలెత్తుకుని నిలిచేలా.. తెలంగాణ బిడ్డ సగర్వంగా దేశానికి, ప్రపంచానికి చాటి చెప్పే విధంగా తెలంగాణ తనను తాను పాలించుకుంటుంది.

తెలంగాణ ఒక శక్తివంతమైన నినాదం.. కోట్లాది మందిని ఏకం చేసిన నినాదం! ఒకటిన్నర దశాబ్దాల కాలం నుంచి రాష్ట్ర రాజకీయాలను తన చుట్టూ తిప్పుకున్న ఈ నినాద ఫలితం… తెలంగాణ ఎంత శక్తివంతమైన రాష్ట్రమో కేసీఆర్ తన పాలనలో దేశానికి చూపించారు. నీళ్లు, నిధులు, నియామకాలు.. ఈ నినాదంతో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేసింది. కోట్లాది మందిని ఏకం చేసి ప్రత్యేక రాష్ట్ర సాధన దిశగా సాగింది. ఎంతో మంది తెలంగాణ అమరవీరుల త్యాగాల ఫలంతో, ఉద్యమకారుల పోరాటంతో 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. సరిగా ఆరేళ్లు పూర్తయ్యాయి. కాళేశ్వరం ప్రాజెక్టు, సీతారామ, పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలు తదితర ప్రాజెక్టులతో కళకళ లాడుతోంది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలను రాష్ట్రానికి వెన్నెముకలా నిలుపుకుంది!

పారిశ్రామిక అభివృద్ధి కోసం ప్రభుత్వపరంగా కూడా పెట్టుబడి దారులకు అనుకూలమైన పారిశ్రామిక విధానం ఉండేలా ప్రభుత్వం తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్టు అప్రూవల్ & సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ (టి – ఐపాస్) చట్టం చేసి, సులభతర అనుమతుల విధానం ప్రవేశ పెట్టింది. విద్యాపరంగానూ రాష్ట్రం అభివృద్ధి సాధించింది. తెలంగాణ ఏర్పాటు కాకముందు రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కలిపి కేవలం 298 రెసిడెన్షియల్ స్కూళ్లు మాత్రమే ఉండేవి. కొత్తగా 661 రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభించిన ప్రభుత్వం మొత్తం రెసిడెన్షియల్ స్కూళ్ల సంఖ్యను 959 కి తీసుకువచ్చింది. రైతుల కళ్లల్లో ఆనందాలు నింపుతుంది. పూర్తిగా రైతులను దృష్టిలో పెట్టుకునే తెలంగాణలో ప్రభుత్వ పాలన సాగుతుందన్నా అతిశయోక్తి కాదేమో!

ఉన్న చిన్న చిన్న సమస్యలను కూడా అధిగమించుకుంటూ మరింతగా రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని కోరుకుంటూ, సాగుతుందని నమ్ముతూ తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు

Read more RELATED
Recommended to you

Exit mobile version