తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. ఈ నెల 6న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు ఇవాళ్టి సభలో ఎనిమిది బిల్లులకు ఆమోదం తెలపడంతో ముగిశాయి. శాసనసభలో 8 కీలక బిల్లులను ప్రవేశపెట్టారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 8 బిల్లులకు సభ్యులు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా కొత్త పార్లమెంట్ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలని మంత్రి కేటీఆర్ తీర్మానం ప్రవేశపెట్టారు. జీఎస్టీ చట్ట సవరణ బిల్లును తలసాని ప్రవేశపెట్టగా.. జీహెచ్ఎంసీ, పురపాలక చట్ట సవరణ బిల్లును మంత్రి కేటీఆర్ ప్రతిపాదించారు.
అటవీశాస్త్ర విశ్వవిద్యాలయ ఏర్పాటు బిల్లు, పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ చట్ట సవరణ బిల్లు, డీఎంఈ, అదనపు డీఎంఈల పదవీ విరమణ వయసు 65 ఏళ్లకు పెంపు బిల్లును శాసనసభ ఆమోదించింది. అజామాబాద్ పారిశ్రామిక చట్ట సవరణ బిల్లు, విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు బిల్లుకులకు పచ్చజెండా ఊపింది.
రాష్ట్రంలో మరికొన్ని ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు అనుమతి ఇవ్వాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లులో ప్రతిపాదించారు. 25 శాతం సీట్లను రాష్ట్రానికి చెందిన విద్యార్థులకే కేటాయించేలా ప్రత్యేక నిబంధన పెట్టినట్లు వెల్లడించారు. వీటన్నింటికీ సభ్యులు మూజువాణీ ఓటుతో ఆమోదం తెలిపారు.