రేపు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ అత్యవసర భేటీ కానుంది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన, శనివారం (రేపు) మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర కేబినెట్ అత్యవసర భేటీ కానున్నది. ఈ సందర్భంగా.. రాష్ట్రంలో కరోనా , లాక్ డౌన్, వర్షపాతం, వానాకాలం సాగు, వ్యవసాయం సంబంధిత సీజనల్ అంశాలు, గోదావరిలో నీటిని లిఫ్టు చేసే అంశం, హైడల్ పవర్ ఉత్పత్తి.. తదితర అంశాల పై కేబినెట్ చర్చించనున్నది. తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో లాక్ డౌన్ ఎత్తివేయాలని యోచిస్తోన్నట్లు సమాచారం.
అయితే తెలంగాణ సర్కార్ లాక్ డౌన్ ఎత్తివేస్తుందా ? లేక అలాగే కొనసాగిస్తుందా ? అనే విషయంపై రేపటి కేబినెట్ భేటీ లో క్లారిటీ రానుంది. ఇక జూన్ 19 తో తెలంగాణలో లాక్ డౌన్ గడువు ముగుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మినహాయింపులు ఇచ్చారు. కాగా తెలంగాణలో కొత్తగా 1417 కరోనా కేసులు, 12 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం 610834 పాజిటివ్ కేసులు నమోదు కాగా మరణాల సంఖ్య 3546 కు చేరుకుంది.