మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం నందుపల్లి గ్రామానికి చెందిన శరత్ అనే యువ రైతు తమ తాత ముత్తాతలనుండి వారసత్వంగా వస్తున్న 7 ఎకరాల 1 గుంట పొలం కబ్జాకి గురైందని, దాన్ని కొండపల్లి శంకరమ్మ అనే కోటీశ్వరులు తమ భూమిని కబ్జా చేశారని, ఆ భూమిని వారి పేర రిజిష్రేషన్ చేశారని. తమ భూమిని తమ అనుమతి లేకుండా వారి పేరున ఎలా రిజిస్టర్ చేస్తారంటూ ప్రశ్నిస్తే సమాధానం లేదని వీడియో ద్వారా తెలిపాడు శరత్. ఇది తన ఒక్కని బాధ మాత్రమే కాదని, తనలాంటివారు చాలామంది ఉన్నారని తెలిపాడు. తన వీడియో సీఎం కేసీఆర్ వరకు చేరాలంటూ విజ్ఞప్తి చేశాడు. ఇక ఆ వీడియో వైరల్‌గా మారడం.. సీఎం కేసీఆర్ దృష్టిలో పడటం.. సీఎం నేరుగా శరత్ కి కాల్ చేయడం జరిగిపోయాయి..
శరత్ వీడియోపై స్పందించిన సీఎం కేసీఆర్..రైతు శరత్‌తో స్వయంగా ఫోన్ లో మాట్లాడారు.రైతు శరత్ ఇంటికి వెళ్లి సమస్యను పరిష్కరించాల్సిందిగా సీఎం కేసీఆర్ మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళీకేరిని ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో కలెక్టర్ భారతి హోళీకేరి నందులపల్లి గ్రామంలోని శరత్ ఇంటికి వెళ్లి సమస్యను అడిగి తెలుసుకున్నారు. శరత్ సమస్యను పరిష్కరిస్తామని కలెక్టర్ హామీనిచ్చారు. సీఎం కేసీఆర్ రైతు శరత్ తో స్వయంగా మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
ఇలాంటి సీన్లు సినిమాల్లో మాత్రమే చూడగలం.. ట్విట్టర్‌లో సమస్యలకి పరిష్కారం చూపినా.. బాధితుడికి నేరుగా ఫోన్ చేసి సమస్యను తీర్చినా అది టీఆర్‌ఎస్ ప్రభుత్వం వల్లే అవుతుందంటూ టీఆర్‌ఎస్ కార్యకర్తలు గళ్లలు ఎగరేస్తున్నారు.