హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో ఆదివారం రోజున కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు ప్రదీప్ మృతి చెందిన ఘటనను హైకోర్టు సుమోటో పిటిషన్‌గా స్వీకరించింది. పత్రికల్లో వచ్చిన వార్తలను పిల్‌గా పరిగణించింది. దీనిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఇవాళ విచారణ చేయనుంది.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక శాఖ కార్యదర్శి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్. జీహెచ్‌ఎంసీ అంబర్‌పేట డిప్యూటీ కమిషనర్, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీని ప్రతివాదులుగా చేసింది.
కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మరణించిన ఘటనపై కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల బృందం బుధవారం ఎస్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు చేసింది. కుక్కలను అదుపు చేసే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మిలపై కేసులు నమోదు చేయాలని కమిషన్‌ను కోరామని కాంగ్రెస్ నాయకులు తెలిపారు.