‘టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసు’ను సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని పిటిషన్ వేసే అర్హత బీజేపీకి ఉందా లేదా అనే అంశాన్ని ఇవాళ హైకోర్టు తేల్చనుంది. బీజేపీ పిటిషన్ విచారణార్హతపై సోమవారం వాదనలు జరిగాయి. బీజేపీకి పిటిషన్ వేసే అర్హత లేదని అడ్వకేట్ జనరల్ వాదించారు. పిటిషనర్ పేరు FIRలో లేదన్నారు. కేసు దర్యాప్తు ప్రారంభ దశలోనే ఉండగా సీబీఐకి ఇవ్వాలనడం సరైంది కాదని కోర్టుకు వివరించారు.
ఎమ్మెల్యేలకు ఎర కేసులో పోలీసుల దర్యాప్తు పారదర్శకంగా జరగడం లేదని బీజేపీ తరఫున న్యాయవాది వాదించారు. పోలీసుల తీరు అనుమానాలకు తావిచ్చేలా ఉందని అన్నారు. సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలోని సిట్ దర్యాప్తు జరిపితే వాస్తవాలు బయటపడతాయని కోర్టుకు వివరించారు. పిటిషన్ విచారణ అర్హతపై ఇరువైపుల న్యాయవాదులు పలు సుప్రీం కోర్టు తీర్పులను ప్రస్తావించారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు ఈ అంశంపై ఇవాళ తన నిర్ణయం వెల్లడించి.. ఉత్తర్వులు జారీ చేయనుంది.