మొదటిసారిగా కేంద్ర ప్రభుత్వంలో ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరగనున్నాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరగనున్న ఈ వేడుకలకు బీజేపీ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు చేసింది. ఉత్సవాలకు ముఖ్య అథితిగా హాజరుకానున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా.. మువ్వన్నెల జెండాను ఎగరవేయనున్నారు. శుక్రవారం రాత్రే ఆయన హైదరాబాద్‌కు చేరుకున్నారు.
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌ను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఇందులో వెయ్యి ఉరుల మర్రి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. నిజాం అరాచక పాలనకు వ్యతిరేకంగా పోరు సాగించిన రాంజీ గోండు అనుచరుల్లో వెయ్యిమందిని నిర్మల్‌లోని ఒక మర్రి చెట్టుకు ఉరి తీశారు. నిజాం అరాచకాలు, సర్దార్ వల్లభాయ్ పటేల్ సాహసానికి సంబంధించిన ఛాయాచిత్ర ప్రదర్శనను కేంద్రం ఏర్పాటు చేసింది.
ఇవాళ ఉదయం 8 గంటల 45 నిమిషాలకు అమిత్‌షా పరేడ్‌గ్రౌండ్‌కు చేరుకుంటారు. తొలుత సైనిక అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం జాతీయజెండాను ఎగురవేస్తారు. కేంద్ర బలగాల గౌరవ వందనం స్వీకరించనున్నారు. తెలంగాణ విమోచన వేడుకలను కేంద్రం నిర్వహించడానికి కారణాలు, కేసీఆర్ వైఖరిపై అమిత్‌షా ప్రసంగించనున్నారు.